ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. 18వ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన డీసీ.. మరో విజయంపై కన్నేసింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచిన ఆర్సీబీ.. నాలుగో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు జోరు మీదుండడంతో మ్యాచ్ అభిమానులను అలరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ భారీ రికార్డుపై కన్నేశాడు.
టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలకు విరాట్ కోహ్లీ ఓ అడుగు దూరంలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో కింగ్ అర్ధ శతకం చేస్తే.. టీ20 ఫార్మాట్‌లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుంటాడు. తద్వారా పొట్టి ఫార్మాట్‌లో ఈ ఫీట్ అందుకున్న రెండో బ్యాటర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ముందున్నాడు. వార్నర్ టీ20 ఫార్మాట్‌లో 108 హాఫ్ సెంచరీలు బాదాడు. బాబర్ ఆజమ్ (90), క్రిస్ గేల్ (88), జోస్ బట్లర్ (86) టాప్ 5లో కొనసాగుతున్నారు.
Also Read: Sai Sudharsan: ఐపీఎల్‌లో మొదటి బ్యాటర్‌గా సాయి సుదర్శన్.. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్!
విరాట్ కోహ్లీ ఇటీవలే టీ20 క్రికెట్‌లో 13,000 పరుగులను పూర్తి చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదవ బ్యాటర్‌గా నిలిచాడు. విరాట్ తన 386వ టీ20 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. అదే సమయంలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 381 ఇన్నింగ్స్‌లలోనే 13,000 పరుగులను చేరుకున్నాడు. ఇక కోహ్లీ కంటే ముందు నలుగురు క్రికెటర్లు టీ20ల్లో 13 వేల రన్స్ పూర్తి చేశారు. క్రిస్ గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్ ముందున్నారు.