టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన పేరు గుర్తు పెట్టుకోవడంతో షాక్‌కు గురయ్యా అని పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు నేహాల్ వధేరా తెలిపాడు. విరాట్ తన షాట్ సెలక్షన్‌ను ఎంతో మెచ్చుకున్నాడని, కోహ్లీ భాయ్‌తో మాట్లాడడంతో ఆట పట్ల తన దృక్పథం మారిందన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్ గెలిచిన తర్వాత తానెంతో ఆరాధించే యువరాజ్ సింగ్ నుంచి ఫోన్ వచ్చిందని నేహాల్ వధేరా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో రాణిస్తున్న నేహాల్ 7 మ్యాచ్‌ల్లో 37.80 సగటు, 146.51 స్ట్రైక్ రేట్‌తో 189 పరుగులు చేశాడు.
బెంగళూరుపై 33 పరుగులు చేసి పంజాబ్‌ను గెలిపించిన తర్వాత నేహాల్ వధేరాతో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ‘బెంగళూరు, పంజాబ్ మ్యాచ్ సందర్భంగా మా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో విరాట్ భాయ్ మాట్లాడుతున్నాడు. నేను వారికి సమీపంగా వెళ్లగానే.. ఎలా ఉన్నావ్ నేహాల్ అని పంజాబీలో కోహ్లీ పలకరించాడు. విరాట్ నా పేరు గుర్తు పెట్టుకోవడంతో షాక్‌కు గురయ్యా. నేను గత రెండేళ్లుగా కోహ్లీతో మాట్లాడాలని అనుకున్నా. ముంబై తరఫున ఆడినప్పుడు సూర్య, తిలక్ భాయ్‌లకు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పా. ఆ తపనే కోహ్లీని కలవడానికి కారణమైంది. గత రెండేళ్లుగా నా ఆట చూస్తున్నారు, ఎలా ఉంది? అని కోహ్లీని అడిగాను. నా షాట్ సెలక్షన్ చాలా బాగుందన్నారు. విరాట్ భాయ్‌తో మాట్లాడడంతో ఆట పట్ల నా దృక్పథం పూర్తిగా మారింది’ అని నేహాల్ తెలిపాడు.
Also Read: CM Chandrababu: మంత్రి పదవి అడిగితే.. నన్ను కిందికి పైకి చూశారు!
ఆర్సీబీపై పంజాబ్ గెలిచిన తర్వాత యువరాజ్ సింగ్ నుంచి ఫోన్ వచ్చిందని 24 ఏళ్ల నేహాల్ వధేరా చెప్పాడు. యువీ మాటలు తనకు బంగారం లాంటివని, మరింత రాణించేందుకు యువీ సలహాలు ఇచ్చాడని పేర్కొన్నాడు. నేహాల్ వాధేరా 2023లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ తరపున సత్తా చాటుతున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 189 పరుగులు చేశాడు.