ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో వేలం జరగనుంది. వేలానికి మొత్తంగా 1,574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. తాజాగా మరో ముగ్గురిని జత చేసింది. వేలంలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఈసారి టీమిండియా స్టార్స్ ఉండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే మెగా వేలం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ అలర్ట్.
ఐపీఎల్ 2025 మెగా వేలం సమయంలో బీసీసీఐ స్వల్ప మార్పు చేసింది. బ్రాడ్‌కాస్టర్ల అభ్యర్థన మేరకు వేలం సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30కు మార్చింది. ఇందుకు కారణం భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్. మ్యాచ్ జరిగే 3, 4 రోజుల్లో వేలం జరగనుంది. ప్రస్తుతం పెర్త్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఉదయం 7.50కి ఆరంభమై.. మధ్యాహ్నం 2.50కి ముగుస్తుంది. కొన్నిసార్లు లేట్ కూడా అవ్వొచ్చు. నిన్న మ్యాచ్ 3 తర్వాత ముగిసింది. ఈ సందర్భంలో వేలానికి ఇబ్బంది ఉంటుంది. టెస్ట్ మ్యాచ్, ఆక్షన్ టైమ్‌లు క్లాష్ కాకుండా.. అర్ధగంట వేలంను లేటుగా ఆరంభించనున్నారు.
Also Read: Gold Rate Today: ఈ పెరుగుదలకు అంతేలేదా?.. తులం బంగారం ఎంతకు చేరిందో తెలుసా?
మెగా వేలంకు ముందు ఫ్రాంచైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఐపీఎల్ పాలక మండలి అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని జట్లు తమ తమ రిటెన్షన్ జాబితాను విడుదల చేశాయి. ఇక వేలంకు సిద్దమయ్యాయి. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జోస్ బట్లర్, యుజ్వేంద్ర చహల్, ఆర్ అశ్విన్, ఇషాన్ కిషన్, డేవిడ్ వార్నర్ లాంటి స్టార్స్ వేలంలో ఉన్నారు. అయితే అందరి దృష్టి పంత్, అయ్యర్, రాహుల్‌లపై ఉంది. విదేశాల్లో వేలం నిర్వహించడం ఇది రెండవసారి. 2024 మినీ వేలం దుబాయ్‌లో జరిగిన విషయం తెలిసిందే.