Navjot Singh Sidhu Heap Praise on Virat Kohli: సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ మరియు సర్ వివ్ రిచర్డ్స్ కంటే విరాట్ కోహ్లీనే ‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్’ అని భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ కోహ్లీ అని అభిప్రాయపడ్డారు. మూడు ఫార్మాట్లకు అనుగుణంగా ఆడే అసాధారణ నైపుణ్యాన్ని విరాట్ కలిగి ఉన్నాడని ప్రశంసించారు. విరాట్ పరుగుల దాహానికి అతని ఫిట్‌నెస్ ప్రధాన కారణం అని సిద్ధూ చెప్పుకొచ్చారు. సిద్ధు మళ్లీ కామెంట్రీ చేసేందుకు సిద్దమయ్యారు. ఐపీఎల్ 2024లో తన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించనున్నారు.
’70లలో మేటి బౌలర్లు ఉన్న వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ చేసేవాడు. దాదాపు 15-20 ఏళ్లు సన్నీ డామినేట్ చేసాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చి పరుగుల వరద పారించాడు. ఆపై ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వచ్చారు. ఈ నలుగురు ఎవరికి వారే ప్రత్యేకం. ఒక్కరిది ఒక్కో యుగం. అయితే నలుగురిలో పోల్చి చూస్తే.. విరాట్ అత్యుత్తమ బ్యాటర్ అని చెబుతా. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లకు అనుగుణంగా ఆడే అసాధారణ నైపుణ్యాన్ని అతడు కలిగి ఉన్నాడు’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు.
Also Read: Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 14 మందికి గాయాలు!
‘విరాట్ కోహ్లీ సాంకేతిక సామర్థ్యం అద్భుతం. గవాస్కర్, సచిన్, ధోనీ, కోహ్లీలను చూస్తే.. విరాట్ ఫిట్‌గా ఉంటాడు. సచిన్ తన కెరీర్ చివరి దశలలో సమస్యలు ఎదుర్కొన్నాడు. ధోనీ ఫిట్‌గా ఉన్నా.. విరాట్ సూపర్ ఫిట్. ఫిట్‌నెస్ అతనిని ఉన్నత స్థితిలో నిలబెట్టింది. ఇతరులు సాధించలేని స్థాయికి కోహ్లీని చేర్చింది. కోహ్లీ, రోహిత్ శర్మలను వచ్చే టీ20 ప్రపంచకప్ 2024లో కచ్చితంగా ఆడించాలి. ఈ ఇద్దరూ ప్రపంచ క్రికెట్‌కు సూపర్ స్టార్స్. ఫామ్ అనేది ఉదయం వచ్చే తేమ లాంటిది. అది ఎప్పుడైనా పోవచ్చు. కానీ కోహ్లీ, రోహిత్‌ల క్లాస్ ఎప్పటికీ చెరుగదు’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పుకొచ్చారు.