Gulzar House: హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో చోటుచేసుకున్న గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం పట్ల అధికార యంత్రాంగం సీరియస్‌గా స్పందిస్తోంది. భారీగా ప్రాణనష్టం చోటుచేసుకున్న ఈ ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక శాఖలు తమవంతుగా ఆధారాలను సేకరించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రమాద స్థలాన్ని నాగ్‌పూర్‌కు చెందిన ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ బృందం పరిశీలిస్తోంది. నీలేష్ అఖండ నేతృత్వంలోని ఈ బృందం టెక్నికల్ విశ్లేషణల ద్వారా ప్రమాదానికి కారణాలపై దృష్టిసారించింది. ఈ బృందం నివేదిక కీలకంగా మారనుంది.
Read Also: CM Revanth Reddy: వర్షలు పడుతున్నాయి, అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం ఆదేశాలు..!
అంతేగాక, చార్మినార్ పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనపై వారు ఇప్పటికే పలు శాఖలకు అధికారికంగా లేఖలు పంపారు. వాటిలో ONGC, ఫైర్ డిపార్ట్‌మెంట్, GHMC, విద్యుత్ శాఖ, ఫోరెన్సిక్ విభాగంతో పాటు పలు గ్యాస్ కంపెనీలు ఉన్నాయి. వీరందరూ తమ పరిశీలనలు పూర్తి చేసి నివేదికలను పోలీసులకు అందించనున్నారు. చివరిగా, ఈ ప్రమాదంలో భవనం నష్టాన్ని పరిశీలించిన GHMCకు కూడా పోలీసులు లేఖ రాసినట్టు సమాచారం. భవనాన్ని కూల్చివేయాల్సిన అవసరంపై ఆ విభాగం అభిప్రాయాన్ని ఇవ్వాల్సి ఉంది. అన్ని శాఖల నివేదికలు అందిన తర్వాతే చార్మినార్ పోలీసులు తుది నివేదికను విచారణ కమిటీకి సమర్పించనున్నారు.