కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో న్యాయపత్ర అనే పేరుతో 48 పేజీల ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిందని రాజమండ్రి లోక్ సభ అభ్యర్థి గిడుగు రుద్రరాజు తెలిపారు. ఇందులో ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సమాజంలో సామాజిక న్యాయం, కులగణన చేపట్టడం ద్వారా ఆయా కులాల వారికి సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ దాటకూడదని ఉంది.. అయితే, ప్రస్తుత జనాభా ప్రాతిపదికన ప్రజలు వేసిన ప్రక్రియ కొనసాగించే విధంగా పార్లమెంట్లో చట్టం తీసుకొస్తామనే విషయం ఇందులో పొందుపరిచారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతారని దీనిని కూడా ఇందులో పొందుపరిచారని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి లోక్ సభ అభ్యర్థి గిడుగు రుద్రరాజు తెలిపారు.
Read Also: Raj Thackeray: ప్రధాని మోడీ లేకుంటే “రామమందిరం” నిర్మితమయ్యేదే కాదు..
కాగా, ఏ ఉద్యమం జరిగినా నీటి కోసం హక్కుల కోసం భూమి కోసం జరుగుతాయని గిడుగు రుద్రరాజు తెలిపారు. వీటన్నిటినీ పరిరక్షించేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడం జరుగుతుందన్నారు. కిసాన్ న్యాయ పేరుతో రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ గిట్టుబాటు ధర కల్పించడం, పెట్టుబడి కంటే లాభం చేకూర్చే విధంగా కొత్త చట్టానికి కల్పన చేయడం రుణమాఫీ ఆయా రాష్ట్రాన్ని బట్టి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల వరకు నష్టం జరిగిన 30 రోజుల్లోనే రుణమాఫీ చేసే విధంగా పార్లమెంట్లో చట్టం చేస్తామన్నారు. అలాగే, శ్రామికుల కోసం జాతీయ స్థాయిలో ఆరోగ్య భద్రత కలిగించే విధంగా చట్టం తీసుకురావడంతో పాటు కనీస వేతనం రోజుకి 400 రూపాయలు చేస్తూ చట్టం తీసుకు వస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య రూపుమాపడానికై కేంద్రంలో ఉన్న 30 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అన్ని అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు గిడుగు రుద్రరాజు వెల్లడించారు.