World Bank Chief Ajay Banga: భారత జీ20 అధ్యక్షత గురించి ప్రశంసలు కురిపించారు ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగా. భారత్ తన జీ20 ప్రెసిడెన్సీలో ప్రపంచానికి ఒక మార్గాన్ని నిర్దేశించిందని, జీ20 డిక్లరేషన్‌ను అన్ని జీ20 దేశాలు ఏకాభిప్రాయంగా ఆమోదించాయని ప్రశంసించారు. సవాళ్లు ఎల్లప్పుడూ ఉంటాయని, అయితే ఏకాభిప్రాయం సాధించడం ద్వారా భారతదేశం మార్గాన్ని చూపిందని ఉద్ఘాటించారు. ప్రపంచ జీడీపీలో 80 శాతం కలికిన దేశాలు ఒక దగ్గరకు చేరిన సమయంలో.. జీ20 డిక్లరేషన్ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందినందుకు అభినందిస్తున్నానని ఆయన అన్నారు.
Also Read: Dengue Outbreak: ఉత్తరాఖండ్‌లో డెంగ్యూ డేంజర్ బెల్స్.. చర్యలు చేపట్టిన సర్కారు
“ఏ 20 దేశాలు ప్రతిదానికీ అంగీకరించవు. ప్రజలు తమ జాతీయ ప్రయోజనాలను చూసుకోవాలి. కానీ ఆ సమావేశంలో అందరూ అంగీకరించారు.” అని అన్నారాయన. అంతకుముందు శనివారం G20 ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించారు. ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ మానవతా చట్టం, శాంతి, స్థిరత్వాన్ని కాపాడే బహుపాక్షిక వ్యవస్థతో సహా అంతర్జాతీయ చట్టాన్ని సమర్థించాలని దేశాలకు డిక్లరేషన్ పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని తీర్మానం పిలుపునిచ్చింది. నేటి కాలం యుద్ధాల శకం కాకూడదని పేర్కొన్నది. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను కట్టుబడి ఉండాలని, దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను గౌరవించాలని స్పష్టం చేసింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దాన్ని నివారించాల్సిందేనని నేతలు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఏర్పడిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు బలమైన, సుస్థిరమైన, సమగ్రమైన వృద్ధి సాధించడమే సమాధానమని అభిప్రాయపడ్డారు. సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి ఒప్పందాన్ని ఊహించింది. డిక్లరేషన్‌లోని అతిపెద్ద టేకవే ఏమిటంటే, డిక్లరేషన్‌లోని మొత్తం 83 పేరాలు చైనా, రష్యా ఒప్పందంతో 100 శాతం ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి.
Also Read: Russia: ఉక్రెయిన్-రష్యాల మధ్య శాంతి.. రష్యా మంత్రి ఏమన్నారంటే..?
శనివారం జరిగిన G20 సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో కొత్త శాశ్వత సభ్యునిగా చేర్చడం ద్వారా ప్రపంచ నిర్ణయాధికారంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. శనివారం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సమక్షంలో ప్రధాని మోడీ గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌ను ప్రారంభించారు. కాగా, దీనికి ముందు భారత్, మిడిల్ ఈస్ట్, యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా మెరుగుపరిచేందుకు కనెక్టివిటీ కారిడార్‌ను జీ20 దేశాల అధినేతలు ప్రారంభించారు. స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక ఏకీకరణకు ఈ కారిడార్ కనెక్టివిటీ దోహదపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది చారిత్రక ఒప్పందమని కొనియాడారు.