షెల్లాట్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మహిళ భారత్ జట్టు సత్తా చాటింది. ప్రత్యర్థి జట్టుపై ఘన విజయం సాధించి మహిళల ఆసియాకప్-2022 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ జట్టు గెలిచి కప్ కైవసం చేసుకుంది. తద్వారా 7వ ఆసియాకప్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది భారత జట్టు. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
Also Read : King Cobra And Mongoose Massive Fight: నాగుపాము- ముంగీస ఫైటింగ్ ఎప్పుడైనా చూశారా..? ఇదిగో మీ కోసం..!
భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను పూర్తి చేసింది. ఈ మ్యాచ్లో భారత పేసర్ రేణుకా సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచడం విశేషం. రేణుక తన 4 ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి శభాష్ అనిపించుకుంది. ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ రాణా చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణి సింఘే (13), రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లనే సాధించారు.