NTV Telugu Site icon

Champions Trophy 2025: పాకిస్థాన్‌కు అస్సలు వెళ్లం.. వేదిక మార్చండి: బీసీసీఐ

Ind Vs Pak

Ind Vs Pak

India won’t travel to Pakistan for Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనుంది. ఇప్ప‌టికే ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంద‌జేసింది. అయితే ఈ షెడ్యూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడదని తాజాగా ఐసీసీకి బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి భారత జట్టు హాజరు కాదని సమాచారం. పాకిస్థాన్‌కు తాము వెళ్లమని ఐసీసీకి బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది. భారత్ ఆడే ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లను దుబాయ్‌ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్లు సమాచారం. ఇంతకుముందు 2023లో ఆసియా కప్ కూడా హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది. ఇతర దేశాలు పాకిస్తాన్‌కు వెళ్లి ఆడగా.. టీమిండియా మాత్రం తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది.

Also Read: Viral Video: శుభ్‌మాన్ గిల్ సోదరితో రింకూ సింగ్.. వీడియో వైరల్!

పాకిస్థాన్‌లో భద్రత కారణంగానే భారత్ అక్కడికి వెళ్లడం లేదు. ఈ విషయంలో అంతిమ నిర్ణయం కేంద్ర ప్రభుత్వందే అన్న విషయం తెలిసిందే. భారత్ తమ దేశానికి రావాలని, భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తామని పీసీబీ హామీ ఇచ్చినా బీసీసీఐ మాత్రం ఒప్పుకోవడం లేదు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇండో-పాక్ జట్లు తలపడుతున్నాయి. ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.