UNSC Resolution: ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను విలీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా రష్యా వీటో చేసింది. ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. నాలుగు ప్రాంతాల విలీనం చేసుకోవడంపై నాటో సెక్రటరీ-జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మండిపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా భూభాగాన్ని బలవంతంగా లాక్కోవడానికి జరిగిన అతిపెద్ద ప్రయత్నంగా దీన్ని పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్‌లు కూడా విలీన చర్యను తీవ్రంగా ఖండించాయి. వెయ్యికిపైగా రష్యన్ సంస్థలు, ప్రముఖులపై అమెరికా నిషేధించింది. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా పలు సేవలు, వస్తువుల ఎగుమతులపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. పుతిన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ పలు వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయవద్దనీ.. రెఫరెండానికి, విలీనానికి చట్టబద్ధత లేదనీ అన్నారు. ఉక్రెయిన్‌కు అదనంగా సుమారు రూ.98 వేల కోట్లసాయం అందించనున్నట్టు ప్రకటించారు.
రష్యా రిఫరెండంపై ఐరాస ప్రతినిధులు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రష్యా రిఫరెండం చెల్లదని, నాలుగు ప్రాంతాలను తుపాకులతో బెదిరించి ప్రజాభిప్రాయం చేపట్టిందని పేర్కొంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. రష్యా వీటో చేయడంతో తీర్మానం ఆమోదం పొందడంలో విఫలమైంది. 15 దేశాల కౌన్సిల్‌లో, 10 దేశాలు తీర్మానానికి ఓటు వేయగా, చైనా, గాబన్, ఇండియా, బ్రెజిల్ గైర్హాజరయ్యాయి. యూఎన్‌లోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ఇటీవలి పరిణామాలతో భారతదేశం తీవ్రంగా కలత చెందిందని, మానవ ప్రాణాలను పణంగా పెట్టి ఎటువంటి పరిష్కారమూ రాదని భారత్ ఎప్పుడూ వాదిస్తోందని తెలిపారు.