India Arms Import: ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ దూసుకెళ్తోంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక ప్రకారం.. 2013-17 మరియు 2018-22 మధ్య ఆయుధాల దిగుమతిలో 11 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ, భారతదేశం 2018 నుండి 2022 వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా మొదటి స్థానంలో ఉండగా.. సౌదీ అరేబియా తర్వాతి స్థానంలో ఉంది. రక్షణ కొనుగోళ్ల ప్రక్రియలో సంక్లిష్టత, భిన్న సరఫరాదారుల నుంచి సమీకరణకు ప్రయత్నాలు, స్వదేశీ డిజైన్లకు ప్రాధాన్యం వంటివి ఈ తగ్గుదలకు కారణం అవుతున్నాయి. స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ) తన తాజా నివేదికలో ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 2018-22లో ప్రపంచంలో తొలి ఐదు ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా, చైనాలు నిలిచాయి. అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా అమెరికా కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీలు ఉన్నాయి. పాకిస్థాన్, చైనాలతో భారత్‌కు ఉన్న ఉద్రిక్తతలు ఆయుధాల దిగుమతులకు డిమాండ్‌ను పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది.
Read Also: Delhi MLA’s Salaries: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు.. ఇప్పుడు ఎంతో తెలుసా?
రష్యా, ఫ్రాన్స్‌లతో పాటు, భారతదేశం కూడా ఈ ఐదేళ్ల కాలంలో ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా నుండి ఆయుధాలను దిగుమతి చేసుకుంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ఆయుధ ఎగుమతిదారులలో ఉన్నాయి. ఇతర సరఫరా దేశాల నుంచి బలమైన పోటీ, భారత ఆయుధాల ఉత్పత్తి పెరగడం, 2022 నుంచి ఉక్రెయిన్‌పై దాడికి సంబంధించి రష్యా ఆయుధాల ఎగుమతులపై ఆంక్షల కారణంగా భారత్‌కు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా రష్యా స్థానం ఒత్తిడిలో ఉందని నివేదిక పేర్కొంది. 2018-22లో రష్యా ఆయుధాల ఎగుమతుల్లో మూడింట రెండు వంతుల కంటే తక్కువే భారత్, చైనా, ఈజిప్ట్‌లకు వెళ్లాయని పేర్కొంది. రష్యా ఆయుధాల ఎగుమతులు 37 శాతం తగ్గాయని, అదే సమయంలో చైనా, ఈజిప్టుకు ఎగుమతులు వరుసగా 39 శాతం మరియు 44 శాతం పెరిగాయని పేర్కొంది. అయితే, 2021-22లో రష్యా ఈజిప్టుకు డెలివరీలు చేయలేదని, 2018-19 కంటే 2020-22లో చైనాకు డెలివరీల పరిమాణం తక్కువగా ఉందని పేర్కొంది. ఫ్రాన్స్ నుంచి భారతదేశం 62 యుద్ధ విమానాలు, నాలుగు జలాంతర్గాములు దిగుమతి చేసుకుంది.. 2013-17తో పోల్చినప్పుడు 2018-22లో ఫ్రాన్స్ ఆయుధ ఎగుమతులు 44 శాతం పెరిగాయి. అంతర్జాతీయ ఆయుధ మార్కెట్‌లో రష్యా ఎగుమతులు తగ్గుతుండగా.. ఫ్రాన్స్ వాటా పెరుగుతోంది. 2018-22లో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా 33 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. రష్యా వాటా 22 నుంచి 16 శాతానికి తగ్గింది.
Reading: Illicit Affairs: జైల్లో ఖైదీలతోనే మహిళా గార్డులు శృంగారం.. ఉద్యోగాల నుంచి తొలగింపు
సిప్రీ నివేదిక ప్రకారం ప్రపంచలోనే 8 వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా పాకిస్థాన్ ఉంది. అయితే 2018-22 కాలంలో ఆ దేశ అస్త్ర దిగుమతులు 14 శాతం తగ్గాయి. ప్రధానంగా చైనా నుంచే వీటిని కొంటోంది. 2021 చివరి వరకూ ఉక్రెయిన్ ఆయుధ దిగుమతులు చాలా స్వల్పంగా ఉండేవి. గత ఏడాది ఫిబ్రవరి 24న ఈ దేశంపై రష్యా యుద్ధానికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రష్యాను ఎదుర్కొనేందుకు ఆయుధాలు అవసరం కావడంతో వివిధ దేశాల నుంచి అస్త్రాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. దీంతో 2022లో ప్రపంచంలోనే మూడో పెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్ నిలిచిపోయింది.