NTV Telugu Site icon

Gautam Gambhir: టీమిండియా అభిమానులకు శుభవార్త.. అప్పటివరకు జట్టులోనే కోహ్లీ-రోహిత్!

Virat Kohli Hugs Rohit Sharma

Virat Kohli Hugs Rohit Sharma

Gautam Gambhir about Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాము వన్డే, టెస్టులకు మాత్రం అందుబాటులో ఉంటామని చెప్పారు. టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వడంతో వారు ఎప్పటివరకు జట్టులో కొనసాగుతారనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్, కోహ్లీలు ఉంటారో లేదో అని ఫాన్స్ చర్చించుకున్నారు. దీనిపై టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌ గంభీర్‌ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఫిట్‌నెస్ ఉండి.. వారు ఆడాలనుకుంటే మాత్రం 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులోనే కొనసాగుతారని గంభీర్ అన్నాడు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్‌ గంభీర్‌ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు. మరికొన్నాళ్ల పాటు వారు క్రికెట్ ఆడతారు. ఎలాంటి ప్లేయర్స్ ఆడాలని ఏ జట్టు అయినా కోరుకుంటుంది. ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఉంది. వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. అందులో వారు తప్పక ఆడతారు. ఫిట్‌నెస్‌, ఫామ్‌ కాపాడుకుంటూ ఉంటే.. 2027 ప్రపంచకప్‌లోనూ తప్పక ఆడతారు. ఏ నిర్ణయం అయినా వారిదే’ అని అన్నాడు.

Also Read: Hardik-Agarkar: అందుకే హార్దిక్‌‌ పాండ్యాను కెప్టెన్‌ చేయలేదు: చీఫ్ సెలక్టర్ అగార్కర్

‘ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్టును నడిపించేందుకు వచ్చా. భారత్ టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా నిలిచింది. డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిచింది. జట్టులోని ప్రతి ఒక్కరితో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. బీసీసీఐ కార్యదర్శి జై షా బాగా తెలుసు. సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తుంటాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా బాధ్యతలపై దృష్టిపెట్టాలి. ఇక్కడ గంభీర్‌ ముఖ్యం కాదు. భారత జట్టుకే మొదటి ప్రాధాన్యం’ అని గౌతమ్‌ గంభీర్‌ తెలిపాడు.