IND vs PAK Hockey Match Live Streaming Info: 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు వరుస విజయాలతో దూసుకెళుతోంది. చైనాపై 3-0, జపాన్‌పై 5-0, మలేసియాపై 8-1, కొరియాపై 3-1 తేడాతో నెగ్గిన భారత్.. ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్.. నేడు కీలక సమరానికి సిద్దమైంది. చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. సోనీ స్పోర్ట్స్ టెన్ 1, సోనీ స్పోర్ట్స్ టెన్ 1 హెచ్‌డి ఛానెల్‌లలో ఈ మ్యాచ్ ప్రసారం చేయబడుతుంది. మ్యాచ్‌ను సోనీలివ్ యాప్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
Also Read: Samsung Galaxy M05 Price: 50ఎంపీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ.. 8 వేలకే శాంసంగ్ మొబైల్!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాకిస్థాన్ కూడా మంచి ఫామ్ మీదుంది. జపాన్, చైనాపై విజయాలు సాధించిన పాక్.. మలేసియా, కొరియాపై డ్రా చేసుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. 2013 నుంచి పాకిస్థాన్‌తో ఆడిన 25 మ్యాచ్‌ల్లో భారత్ ఏకంగా 16 మ్యాచ్‌లు గెలిచింది. పాక్ కేవలం 5 విజయాలు మాత్రమే సాధించగా.. 4 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. చివరగా గతేడాది ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌ను 10-2తో భారత్ చిత్తుచేసింది. ఇప్పుడు రెండు టీమ్స్ ఫామ్‌లో ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ జట్టు కఠినమైందని, ఏ దశలోనైనా పుంజుకోగలదని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. ప్రపంచ హాకీలో దాయాది జట్ల మధ్య పోరుకు మరేదీ సాటిరాదన్నాడు.