2025 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొమ్మిదవసారి ఆసియా కప్ గెలవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత పాకిస్తాన్ ఫామ్ దృష్ట్యా టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో భారత్‌కు ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పాలి.
సాధారణంగా ఏదైనా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు రెండు జట్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటాయి. రెండు జట్ల కెప్టెన్లు మ్యాచ్ గురించి మాట్లాడడమే కాకుండా.. ట్రోఫీతో ఫోటోషూట్ కూడా చేస్తారు. అయితే పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు పెద్దగా లేవు. మ్యాచ్ సమయంలో కరచాలనం కూడా చేసుకోవడం లేదు. ఫైనల్ అయినా కూడా ఈరోజు ట్రోఫీతో ఫోటోషూట్ జరగలేదు. అలానే ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జరగలేదు. భారత జట్టు ఫైనల్ కోసం ఒక ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది.
2025 ఆసియా కప్ టైటిల్ పోరుకు ముందు రోజు అనగా.. ఈరోజు భారత జట్టు ప్రాక్టీస్ చేయలేదు. ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. గత రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్ళడంతో బాగా లేట్ అయింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లను తాజాగా ఉంచడానికి జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేదు. ఆటగాళ్లు హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అలానే మ్యాచ్ వ్యూహంపై దృష్టి పెడుతున్నారు. ఫైనల్లో ఆటగాళ్ల దృష్టి, ప్రదర్శన ఉన్నత స్థాయిలో ఉండేలా జట్టు యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది.
Also Read: Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ రేర్ రికార్డు.. ‘ఒకే ఒక్కడు’ మనోడు!
పాకిస్తాన్ జట్టు విలేకరుల సమావేశం భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు జరగనుంది. పాకిస్తాన్ జట్టు సెప్టెంబర్ 25న బంగ్లాదేశ్‌తో తన చివరి మ్యాచ్ ఆడింది. దాంతో పాక్ ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభించింది. ఈరోజు దాయాది ప్లేయర్స్ అందరూ నెట్ ప్రాక్టీస్ చేశారు. టీమిండియాతో జరిగిన గత మ్యాచ్‌లలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్, పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఫాన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు.