Virat Kohli to play 4 Semi Finals in ODI World Cups: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు తొలి సెమీస్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మైదానంలోకి అడుగుపెట్టగానే.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు చేరనుంది. వన్డే ప్రపంచకప్‌లో అత్యధికసార్లు సెమీస్ ఆడిన భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. కింగ్ కోహ్లీ 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో నాలుగోసారి వన్డే సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు.
ఇప్పటివరకు ఏ భారత ఆటగాడు కూడా నాలుగుసార్లు వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ ఆడలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కూడా ఇది సాధ్యం కాలేదు. సచిన్ 1996, 2003, 2011 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో ఆడాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మూడుసార్లు వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ ఆడారు. 2011, 2015, 2019లలో మహీ ఆడాడు. 2007లో భారత్ లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. ఇక 2011, 2015, 2019 వన్డే సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో ఆడిన విరాట్ కోహ్లీ.. నేడు 2023లో సెమీ ఫైనల్స్ ఆడనున్నాడు. భారత్ 8 వన్డే సెమీ ఫైనల్స్ (1983, 1987, 1996, 2003, 2011, 2015, 2019, 2023) ఆడగా.. విరాట్ నాలుగింట భాగం కావడం విశేషం.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకూ మూడు సార్లు సెమీస్ గండం దాటి.. రెండు సార్లు విజేతగా నిలిచింది. 1983 ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన కపిల్ సేన.. ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి కప్ అందుకుంది. 2003 సెమీస్‌లో కెన్యాను 91 పరుగుల తేడాతో చిత్తుచేసిన గంగూలీ సేన.. తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. 2011 సెమీస్‌లో పాకిస్థాన్‌ను 29 పరుగుల తేడాతో ఓడించిన ధోనీ సేన.. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి కప్పు సొంతం చేసుకుంది. ఇక 1987, 1996, 2015, 2019లో సెమీస్‌లోనే భారత్‌కు నిరాశ ఎదురైంది.