ఈ రోజు మ్యాచ్ చాలా బాగనిపించిందని, తన బ్యాటింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేశాను అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాను చేయాల్సిన పరుగులను భాగాలుగా ఎంచుకొని రాబట్టానని, వన్డేల్లో పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు. ప్రత్యర్థి బౌలర్లు తన శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసినప్పుడు.. తన ప్రణాళికలు అమలు పరిచానని హిట్‌మ్యాన్ తెలిపాడు. శుభ్‌మన్ క్లాసీ ప్లేయర్ అని, పరిస్థితులకు అనుగుణంగా ఆడుతాడని రోహిత్ ప్రశంసించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన భారత్ రెండో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) చేశాడు. తనదైన శైలిలో ఆకాశమే హద్దుగా చెలరేగిన హిట్‌మ్యాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ… ‘మ్యాచ్ చాలా బాగనిపించింది. నా బ్యాటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశా. చాలా రోజుల తర్వాత జట్టు కోసం పరుగులు చేయడం సంతోషాన్ని ఇచ్చింది. నేను చేయాల్సిన పరుగులను భాగాలుగా ఎంచుకొని రాబట్టాను. వన్డేల్లో పరిస్థితులకు తగినట్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. నేను బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఎక్కువ పరుగులు చేయాలని నిర్ణయించుకున్నా. ప్రత్యర్థి బౌలర్లు నా శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసినప్పుడు నా ప్రణాళికలు అమలు చేశా’ అని చెప్పాడు.
‘శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ నాకు మద్దతుగా నిలిచారు. మేము బ్యాటింగ్‌ను ఆస్వాదించాము. గిల్ క్లాసీ ప్లేయర్. నేను అతడిని దగ్గరి నుంచి చూశా. పరిస్థితులకు అనుగుణంగా బాగా ఆడుతాడు. మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లు చాలా కీలకం. మిడిల్ ఓవర్లలో బాగా ఆడితే మ్యాచ్ ఎవరైనా గెలిచేందుకు అవకాశం ఉంటుంది. మిడిల్ ఓవర్లలో మేము బాగా బ్యాటింగ్ చేశాము. వీలైనన్ని ఎక్కువగా పరుగులు చేశాం. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడితే ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చు. జట్టుగా మేం బాగా మెరుగవ్వాలనుకున్నాం. ఓ ప్లేయర్, జట్టుగా ఉత్తమంగా మెరుగవ్వాలని గత మ్యాచ్ అనంతరం నేను ఆటగాలకు చెప్పాను. కెప్టెన్, కోచ్ చెప్పిన ప్రకారం ప్లేయర్స్ ప్రదర్శన చేస్తే మ్యాచ్ ఫలితాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు’ అని హిట్‌మ్యాన్ తెలిపాడు.