టెస్టుల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్లో రెండు బలమైన జట్లు భారత్, ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడబోతున్నాయి. గురువారమే తొలి టెస్టు ఆరంభం కానుండగా.. మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియమే వేదిక. స్వదేశంలో భారత్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. అయితే టెస్ట్ ఫార్మాట్లో బాజ్‌బాల్ ఆటతో ఇంగ్లీష్ జట్టు దూకుడు ప్రదర్శిస్తోంది. అందులోనూ సొంతగడ్డపై భారత్ చివరగా టెస్టు సిరీస్ ఓడింది ఇంగ్లండ్ చేతిలోనే. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లోనూ రోహిత్ సేన రాణించాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ ఉదయం గం.9:30 నుంచి స్పోర్ట్స్ 18,జియో సినిమాలలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
భారత బ్యాటింగ్ సత్తాచాటాల్సి ఉంది. ఓపెనర్లు రోహిత్, యశస్వి మధ్య ఇంకా సమన్వయం కుదరలేదు. మూడో స్థానంలో శుభ్‌మన్ నిరూపించుకోవాల్సి ఉంది. కోహ్లీ లేని బ్యాటింగ్ ఆర్డర్లో అతను రాణించడం జట్టుకు అవసరం. కోహ్లీ సహా పుజారా, రహానె లేకపోవడంతో శ్రేయస్, రాహుల్ మిడిలార్డర్‌లో కీలకం కానున్నారు. వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకోకపోతే.. భరత్‌కు ఇబ్బందులు తప్పవు. ధ్రువ్ జూరెల్, రజత్ పటీదార్ డగౌట్‌కే పరిమితమవక తప్పదు. భారత్ బౌలింగ్ బలంగా ఉంది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో నేడు ఆడే అవకాశాలున్నాయి. పేస్ బాధ్యతలను బుమ్రా, సిరాజ్ పంచుకోనున్నారు. జడేజా, అశ్విన్ కచ్చితంగా జట్టులో ఉంటారు. మూడో స్పిన్నర్‌గా అక్షర్, కుల్దీప్ మధ్య పోటీ ఉంది.
ఇంగ్లండ్ పటిష్ఠంగా కనిపిస్తోంది. స్పిన్ పిచ్‌పై తొలి టెస్టు కోసం ముగ్గురు స్పిన్నర్లు జాక్ లీచ్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్‌లీని తీసుకుంది. కానీ వీళ్ల అనుభవలేమి భారత్‌కు కలిసొచ్చే అంశం. మార్క్‌వుడ్ ఒక్కడే పేస్ భారాన్ని మోయనున్నాడు. వెటరన్ పేసర్ అండర్సన్‌ను పక్కనపెట్టారు. మోకాలి శస్త్రచికిత్స నుంచి కోలుకున్న స్టోక్స్ బౌలింగ్ చేసే అవకాశం లేదు. భారత్ అంటే రూట్ చెలరేగిపోతాడు. స్టోక్స్, క్రాలీ, డకెట్, పోప్, బెయిర్‌స్టో, ఫోక్స్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది.
తుది జట్లు:
భారత్ (అంచనా): రోహిత్ (కెప్టెన్), యశస్వి, శుభ్‌మన్, శ్రేయస్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), జడేజా, అక్షర్, అశ్విన్, సిరాజ్, బుమ్రా.
ఇంగ్లాండ్: క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్ (కెప్టెన్), ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, మార్క్‌వుడ్, టామ్ హార్ట్‌లీ, జాక్ లీచ్.