Arshdeep Singh’s injury Update: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 1-2 తేడాతో వెనుకబడి ఉంది. టెస్ట్ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న భారత్.. 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. లార్డ్స్ టెస్టులో ఓటమితో తీవ్ర విమర్శల పాలైన గిల్ సేన.. మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ఆరంభం కానుంది. ఈ సమయంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది.
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు గాయం అయింది. గురువారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. బ్యాటర్ సాయి సుదర్శన్ కొట్టిన షాట్‌ను అడ్డుకునే ప్రయత్నంలో అర్ష్‌దీప్ చేతికి తీవ్ర గాయమైంది. వెంటనే ఫిజియో వచ్చి వేలికి టేప్ వేసి.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. అర్ష్‌దీప్ గాయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ చేతికి కుట్లు పడితే.. కొన్ని రోజులు ఆటకు దూరమవొచ్చని టీమిండియా సహాయక కోచ్ టెన్ డస్కాటె తెలిపాడు. అర్ష్‌దీప్ ఎడమ చేతికి బ్యాండేజ్‌తో ఉన్నట్లు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Yu Zidi Swimmer: పిల్ల పిడుగు.. 12 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు అర్హత!
ప్రస్తుత సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు ఇప్పటివరకు ఒక్క టెస్ట్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే జస్ప్రీత్ బుమ్రా లేదా మరో ఫాస్ట్ బౌలర్ విశ్రాంతి తీసుకుంటే.. అర్ష్‌దీప్ మాంచెస్టర్ టెస్ట్ తుది జట్టులోకి రానున్నాడు. ఇంతలోనే అతడు గాయపడడం టీమిండియా మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అర్ష్‌దీప్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 63 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు పడగొట్టాడు. 26 ఏళ్ల అర్ష్‌దీప్ వన్డేల్లో కూడా మంచి ప్రదర్శనే చేశాడు. 9 వన్డేల్లో 14 వికెట్లు పడగొట్టాడు.