Yu Zidi Qualifies for 2025 World Swimming Championships: చైనాకు చెందిన బాలిక ‘యు జిడి’ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. 12 ఏళ్ల వయసులో సింగపూర్‌లో జరిగే 2025 ప్రపంచ స్విమింగ్ ఛాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించడమే ఇందుకు కారణం. సింగపూర్ ఛాంపియన్‌షిప్‌లో మూడు విభాగాల్లో యు జిడి పతక పోటీ దారుగా ఉంది. 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే.. 200 మీటర్ల బటర్ ఫ్లైలో పిల్ల పిడుగు పోటీపడబోతోంది. వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే అని యు జిడి నిరూపించింది. వచ్చే నెలలో సింగపూర్‌లో ఛాంపియన్‌షిప్ ఆరంభం కానుంది.
చైనా ఛాంపియన్‌షిప్‌లో యు జిడి అద్భుతం చేసింది. 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేని 2 నిమిషాల 10.63 సెకన్లలోనే పూర్తి చేసింది. మహిళలు, పురుషుల విభాగాల్లో 12 ఏళ్ల స్విమ్మర్ ఇంత తక్కువ సమయంలో ఇప్పటివరకు రేసును పూర్తి చేయలేదు. 200 మీటర్ల బటర్‌ఫ్లైని 2 నిమిషాల 6.83 సెకన్లలో కంప్లీట్ చేసింది. ఈ టైమింగ్.. పారిస్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో సమానం. ప్రస్తుతం కెనడా స్విమ్మర్ సమ్మర్ మెకంతోష్ పేరుపై 400, 200 మెడ్లేలో ప్రపంచ రికార్డులు ఉన్నాయి. అయితే 12 ఏళ్ల వయసులో మెకంతోష్‌తో పోలిస్తే.. యు జిడి 12-15 సెకన్ల వేగంతో ఈ రేసులు పూర్తి చేయడం విశేషం.
Also Read: T20 World Cup: తొలి మ్యాచ్‌లో భారత్‌తో.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో! ఇప్పటికీ నమ్మలేకపోతున్నా
2028 లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్‌పై చైనా బాలిక యు జిడి దృష్టి పెట్టింది. అమెరికా స్విమ్మర్ కేథీ లెడెకి 15 ఏళ్ల 139 రోజుల వయసులో 2012 లండన్ ఒలింపిక్స్‌లో 800 మీటర్ల ఫ్రీస్టైల్‌లో స్వర్ణం సాధించింది. కేథీ మాదిరే 2028 లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంపై యు జిడి గురి పెట్టింది. అయితే ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన చిన్న వయస్కురాలుగా ఉన్న ఇవాసాకి రికార్డు మాత్రం చైనా బాలిక బద్దలు కొట్టదు. 14 ఏళ్ల 6 రోజుల వయసులో 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో 200 బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఇవాసాకి స్వర్ణం సాధించింది. 2028 ఒలింపిక్స్ వరకు యు జిడి వయసు 15 ఏళ్లు దాటుతుంది. 400 మీటర్ల మెడ్లే, 200 మీటర్ల బటర్‌ఫ్లై తనకు ఇష్టమైన ఈవెంట్లు అని పిల్ల పిడుగు యు జిడి చెప్పింది. వయసు పెరిగాక మిగిలిన విభాగాల్లోనూ రాణిస్తానని ధీమా వ్యక్తం చేసింది.