Ravichandran Ashwin 1 Wicket away for 500 Test Wickets: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా నేడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ ఆరంభం కానుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దాంతో కెప్టెన్స్ రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్‌లు సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని చూస్తున్నారు. అయితే మూడో టెస్ట్ మ్యాచ్ ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారింది. భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు రాజ్‌కోట్ టెస్ట్ చాలా ప్రత్యేకం. ఈ ముగ్గురు అత్యంత అరుదైన మైలురాయిని చేరువలో ఉన్నారు.
Ravichandran Ashwin 500 Test Wickets:
రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ తీస్తే.. టెస్ట్‌ల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని అందుకుంటాడు. అప్పుడు టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో భారతీయుడు, 9వ బౌలర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800) టెస్టుల్లో అత్యధిక వికెట్స్ తీశాడు. షేన్ వార్న్ (708), జేమ్స్ అండర్సన్ (695), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), కోర్ట్నీ వాల్ష్ (519), నాథన్ లియాన్ (517) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ కెరీర్‌లో ఇప్పటివరకు 97 టెస్టు మ్యాచ్‌లు ఆడి 499 వికెట్లు తీశాడు.
James Anderson 700 Test Wickets:
జేమ్స్ ఆండర్సన్ మరో ఐదు వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 700 వికెట్ల అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) జిమ్మీ కంటే ముందు ఉన్నారు. టెస్టు చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా అండర్సన్ నిలవనున్నాడు. కెరీర్‌లో ఇప్పటివరకు 184 టెస్టులు ఆడి.. 343 ఇన్నింగ్స్‌లలో 695 వికెట్లు పడగొట్టాడు.
Also Read: IPL 2024 Schedule: సార్వత్రిక ఎన్నికల తేదీలొచ్చాకే.. ఐపీఎల్ 2024 షెడ్యూల్!
Ben Stokes 100 Test Match:
బెన్ స్టోక్స్‌కు ఇది 100వ టెస్ట్ కావడం విశేషం. దీంతో 100 టెస్టులు ఆడిన ఇంగ్లండ్ 16వ ఆటగాడిగా, ప్రపంచంలో 74వ ఆటగాడిగా రికార్డుల్లో నిలుస్తాడు. డిసెంబర్ 2013లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన స్టోక్స్.. ఇప్పటి వరకు 99 టెస్టుల్లో 179 ఇన్నింగ్స్‌ల్లో 6251 పరుగులు చేశాడు. ఇందులో 31 హాఫ్ సెంచరీలు, 13 సెంచరీలు చేశాడు. స్టోక్స్ టెస్టుల్లో 197 వికెట్లు కూడా తీశాడు. రాజ్‌కోట్ టెస్టులో 3 వికెట్లు తీస్తే.. 200 వికెట్లు పూర్తవుతాయి.