Arun Dhumal React on IPL 2024 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు సమయం ఆసన్నమవుతోంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభం అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఇంకా షెడ్యూల్ విడుదల చేయలేదు. సార్వత్రిక ఎన్నికల డేట్స్ వచ్చాకే.. ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని లీగ్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల తేదీలొచ్చిన తర్వాతనే ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ సీజన్ భారత్‌లోనే జరుగుతుందని పేర్కొన్నారు.
‘భారత్‌లోనే ఐపీఎల్ లీగ్ జరిగేలా కేంద్ర ప్రభుత్వం, ఏజెన్సీలతో కలిసి పనిచేస్తాం. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నాం. ఎన్నికల తేదీలు వచ్చిన అనంతరం ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతాం. ఎన్నికల సమయంలో ఏ తేదీలో ఏ మ్యాచ్ ఏ రాష్ట్రంలో జరగాలనే దానిపై కసరత్తు చేస్తాం. ఐపీఎల్ 2024 దాదాపుగా మార్చి చివర్లో ఆరంభమయ్యే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌లో ఉంటాయి కాబట్టి ప్రభుత్వం సాయంతో మ్యాచ్‌ల నిర్వహణ కోసం పనిచేస్తాం’ అని అరుణ్ ధుమాల్ తెలిపారు.
Also Read: IND vs ENG Test: నేటి నుంచే భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు.. భారత్‌కు మిడిల్‌ఆర్డర్ చిక్కు!
ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మే 26న ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగాల్సి ఉంటుంది. దీంతో రెండు దఫాలుగా ఈ సీజన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ప్లే ఆఫ్స్ చేరని జట్ల భారత ఆటగాళ్లను ముందుగానే అమెరికా పంపేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.