ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా.. వన్డేల్లో ఇంగ్లీష్ జట్టుపై ఆధిపత్యం కొనసాగిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచిన రోహిత్ సేన.. సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం చివరిదైన మూడో వన్డే ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఇది నామమాత్రమైన మ్యాచ్ అయినప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముంగిట ఆడబోతున్న చివరి వన్డే కావడంతో తేలిగ్గా తీసుకోవట్లేదు.
ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు లేవు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోకాలి వాపుతో తొలి వన్డేలో ఆడని కింగ్.. గత మ్యాచ్‌లో 5 పరుగులకే అవుట్ అయ్యాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే అహ్మదాబాద్‌లో అయినా భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి విరాట్ ఎలా ఆడుతాడో చూడాలి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగడం సానుకూలాంశం. కేఎల్ రాహుల్ నిరూపించుకోవాల్సి ఉంది. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు మెరుస్తున్నారు.
మహ్మద్ షమీ, హర్షిత్ రాణా పేస్ బౌలింగ్ బాధ్యతలను బాగానే నిర్వర్తిస్తున్నారు. దాంతో అర్ష్‌దీప్ సింగ్‌కు మ్యాచ్‌లో అవకాశం రాకపోవచ్చు. అహ్మదాబాద్‌లో స్పిన్నర్లు కీలకం కాబట్టి వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆడనున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ అయినా గెలవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. హిట్టర్లతో నిండిన ఇంగ్లండ్ భారీగా పరుగులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. డకెట్, సాల్ట్, బట్లర్, రూట్, లివింగ్‌స్టన్ రాణిస్తున్నారు. బౌలింగ్‌లో రషీద్ ఒక్కడే రాణిస్తున్నాడు. ఆర్చర్ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశముంది. మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, హార్దిక్, అక్షర్, జడేజా, వరుణ్ చక్రవర్తి, షమీ, హర్షిత్ రాణా.
ఇంగ్లండ్: సాల్ట్, డకెట్, బాంటన్, రూట్, బ్రూక్, బట్లర్ (కెప్టెన్), లివింగ్‌స్టన్, కార్స్, రషీద్, ఆర్చర్/సకిబ్, మార్క్ వుడ్.