కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ దూకుడుగా ఆడుతోంది. వర్షం కారణంగా కేవలం నాలుగు సెషన్ల ఆట మాత్రమే సాగినా.. మ్యాచ్‌లో రోహిత్ సేన ఆధిపత్యం కొనసాగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 233 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసి 52 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా ఓపెనర్లను పెవిలియన్ చేర్చింది. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 26/2గా ఉంది. బంగ్లాను త్వరగా ఆలౌట్ చేసి.. విజయం సాధించాలని టీమిండియా చూస్తోంది.
బంగ్లాదేశ్‌పై విజయం సాధించేందుకు భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనివెనక మాస్టర్‌మైండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాగా.. అమలు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ. ఆటను వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లాలని, విజయం సాధించేందుకే ప్రయత్నించాలని రోహిత్‌తో గౌతీ చెప్పాడని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పాడు. కోచ్ కోరుకున్న దానిని ఆటగాళ్లు సరిగ్గా అమలు చేశారన్నాడు. బంగ్లా ఆలౌట్ అయ్యాక రోహిత్‌తో గంభీర్ మాట్లాడి గేమ్ ప్లాన్ చెప్పాడని మోర్కెల్ తెలిపాడు. కాన్పూర్‌లో 4వ రోజు ఆట ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో మోర్కెల్ మాట్లాడుతూ రోహిత్-గంభీర్ కాంబినేషన్‌పై ప్రశంసలు కురిపించాడు.
Also Read: Team India: మంచి ‘బలగం’ ఉంది.. మరో పదేళ్లు ఢోకా లేదు: వీవీఎస్ లక్ష్మణ్
‘మ్యాచ్‌ను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మేం నిర్ణయించాం. జట్టును ముందుండి నడిపించాల్సిన మంచి లీడర్ కావాలి. రోహిత్ శర్మ అందుకు సరిగ్గా సరిపోతాడు. గతంలో అతడు ఇలాంటివి ఎన్నోసార్లు విజయవంతంగా చేశాడు. ఈ టెస్టులోనూ అదే పాటిస్తున్నాడు. రోహిత్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలిచి.. తమ ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పాడు. కొత్త బంతి ఎంత ప్రమాదకరమో తెలిసిందే. అయినా రోహిత్, జైస్వాల్ అదరగొట్టారు. దూకుడుగా ఆడాలంటే ముందుగా కెప్టెన్ కూడా అదే భావనతో ఉండాలి. అప్పుడే జట్టులోని ఆటగాళ్లలో స్ఫూర్తి కలుగుతుంది. ఫీల్డింగ్‌లోనూ రోహిత్ ప్రదర్శన అద్భుతం. జట్టులో భయం అనేది దరిచేరకుండా చేయడంలో గంభీర్‌తో పాటు కెప్టెన్‌గా రోహిత్ సఫలమయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థికి తలొగ్గకూడదనే లక్ష్యంతోనే రోహిత్ ఉంటాడు’ అని మోర్నీ మోర్కెల్ అన్నాడు.