When the chokers wear off for South Africa in ODI World Cups: వన్డే ప్రపంచకప్‌లు ఎన్ని వస్తున్నా.. దక్షిణాఫ్రికా జట్టు రాత మాత్రం మారడం లేదు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అవుతుందన్న మాటను మరోసారి దక్షిణాఫ్రికా టీమ్ నిజం చేసింది. ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికాకు మరోసారి ప్రపంచకప్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. దాంతో ‘చోకర్స్’ అనే ముద్రను తొలగించుకుందామనుకున్న ప్రొటీస్‌కు నిరాశే ఎదురైంది. కీలకమైన మ్యాచ్‌లలో చేతులెత్తేసే నైజం దక్షిణాఫ్రికాది. అందుకే ప్రోటీస్ జట్టును చోకర్స్ అని పిలుస్తుంటారు.
దక్షిణాఫ్రికా అయిదోసారి వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఓటమి పాలైంది. ఇదివరకు 1992, 1999, 2007, 2015లోనూ సెమీ ఫైనల్లోనే ప్రొటీస్ ఇంటిదారి పట్టింది. కేవలం వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో మాత్రమే కాదు.. టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇదే కథ. 2009, 2014లలో సెమీస్ నుంచే నిష్క్రమించింది. వన్డే, టీ20 ప్రపంచకప్‌లను కలుపుకుంటే.. దక్షిణాఫ్రికా సెమీస్‌లో ఓడిపోవడం ఇది ఏడోసారి. ప్రపంచకప్ 2023లో ఫుల్ జోష్ మీదున్న ప్రొటీస్ కీలక సెమీస్‌లో చేతులెత్తేసి మూల్యం చెలించుకుంది. దాంతో ‘చోకర్స్’ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చోకర్స్ ముద్ర పోయేదెప్పుడు, చోకర్స్ ముద్ర పోగొట్టుకునేందుకు దక్షిణాఫ్రికా ఇంకెంతకాలం ఎదురుచూడాలి అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
నిజానికి వన్డే ప్రపంచకప్ 2023కి ముందువరకూ దక్షిణాఫ్రికాను టైటిల్ ఫేవరెట్‌గా పరిగణించేందుకు చాలా మంది సందేహించారు. జట్టు బలంగానే ఉన్నా.. ఎలా ఆడుతుందో అనే అనుమానాలు ఉండేవి. అయితే ప్రపంచకప్ 2023లో అడుగుపెట్టినప్పటి నుంచి భారీ స్కోర్లతో దూసుకెళ్లింది. అంచనాలను మించి రాణించిన ప్రొటీస్.. కచ్చితంగా ఫైనల్ చేరేలా కనిపించింది. కానీ ప్రొటీస్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సెమీస్‌లో ఒత్తిడి చిత్తైన దక్షిణాఫ్రికా.. అయిదోసారీ సెమీస్ గండాన్ని దాటలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Also Read: Pat Cummins: ఈ విజయం అతడి వల్లే.. టాస్ ఓడిపోవడం కలిసొచ్చింది: కమిన్స్
సెమీస్ ముందు వరకూ ముందుగా బ్యాటింగ్ చేసిన మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్స్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసినపుడు ప్రొటీస్ అత్యల్ప స్కోరు 311/7. ఈ స్కోర్ కూడా ఆస్ట్రేలియాపై లీగ్ మ్యాచ్‌లో చేసింది. నాలుగు మ్యాచ్‌ల్లో 350కి పైగా పరుగులు సాధించింది. ఈ గణాంకాలు చూస్తే.. మొదట బ్యాటింగ్‌లో దక్షిణాఫ్రికా దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఛేదనకు దిగిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో (నెదర్లాండ్స్, భారత్ చేతిలో) ఓడిపోయి.. రెండింట్లో (అఫ్గానిస్థాన్, పాకిస్థాన్) నెగ్గింది. అందుకే సెమీస్‌లో టాస్ నెగ్గగానే మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న డికాక్, వాండర్‌డసెన్ విఫలమవడం జట్టును దెబ్బ తీసింది. మిల్లర్ సెంచరీతో పోరాడినా.. విజయానికి సరిపడా పరుగులు చేయలేకపోయింది. బౌలర్లు గెలిపించేందుకు విఫలయత్నం చేసినా.. లక్ష్యం చిన్నది కావడంతో ఓటమి తప్పలేదు.