Ravichandran Ashwin Eye on Anil Kumble’s Record in IND vs AUS 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మొదటి వన్డే ఆరంభం కానుంది. మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 1.30కు మొదలు కానుంది. తొలి వన్డేలో పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ అన్ని విధాలా సిద్దమైంది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో విజయం సాధించాలని భారత్ చూస్తోంది. అయితే తొలి రెండు వన్డేలకు సీనియర్ ప్లేయర్స్ విశ్రాంతి తీసుకోవడంతో.. యువకులు బరిలోకి దిగనున్నారు.
ఏడాదిన్నర తర్వాత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనుహ్యంగా భారత జట్టులోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్‌కు బీసీసీఐ సెలెక్టర్లు రెస్ట్ ఇవ్వడంతో యాష్ తుది జట్టులో ఆడనున్నాడు. ఈ క్రమంలో అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో యాష్ మరో మూడు వికెట్లు పడగొడితే.. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉంది. ఆస్ట్రేలియాపై కుంబ్లే 142 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ప్రస్తుతం 140 వికెట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు.
అక్షర్ పటేల్ గాయం కారణంగా వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌కు భారత జట్టులో చోటు దక్కింది. ఒకవేళ వన్డే వరల్డ్‌కప్ 2023 సమయానికి అక్షర్ కోలుకోకపోతే.. అశ్విన్ మెగా టోర్నీకి ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సత్తా నిరూపించుకునేందుకు అశ్విన్‌కు ఈ సిరీస్ మంచి అవకాశం. గత సంవత్సర కాలంగా యాష్ ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడకున్నా.. అతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.