Rahul Dravid React on Virat Kohli and Rohit Sharma’s Rest: సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. కేవలం 3 వన్డేల కోసం బీసీసీఐ సెలెక్టర్లు రెండు జట్లను ప్రకటించడం. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతిని ఇవ్వగా.. వీరందరికి మూడో వన్డేలో చోటు దక్కింది. అయితే ప్రపంచకప్ 2023 మరో రెండు వారాల్లో ఆరంభం కానుండగా.. సీనియర్లకు రెస్ట్ ఇవ్వడం ఎంత వరకు సమంజసం? అని పలువురు బీసీసీఐపై మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకు విశ్రాంతి ఇవ్వడంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. వారిద్దరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లకు మానసిక, శారీరక విశ్రాంతి అవసరమని పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ల విషయంలో మాకు ఓ క్లారిటీ ఉంది. ప్రపంచకప్ మొదటి ఆరంభం నుంచే వాళ్లు ఫిజికల్‌గా, మెంటల్‌గా మంచి పొజిషన్‌లో ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో వారికి ఎంతో అనుభవం ఉంది. ఎలా ప్రిపేర్ అవ్వాలో వాళ్లకు తెలుసు.టీమ్ అంతా కలిసి చర్చించిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం’ అని హెడ్ కోచ్ ద్రవిడ్ తెలిపాడు.
‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతే ఈ డెసిషన్ తీసుకున్నాం. సీనియర్ ఆటగాళ్లకు తమ బాధ్యత ఏంటో బాగా తెలుసు. ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లోనే సరైన మైండ్ సెట్‌తో దిగడానికి ఏం చేయాలో వాళ్లకు ఓ ఐడియా ఉంది. మూడో వన్డేలో మళ్లీ వాళ్లు ఆడతారు. ఆ తర్వాత ప్రాక్టీస్ మ్యాచులు కూడా ఉన్నాయి’ అని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. మూడో వన్డే సెప్టెంబర్ 27న జరగనుండగా.. అక్టోబర్ 5న మెగా టోర్నీ ఆరంభం కానుంది.