India vs Australia 1st ODI 2023 Preview: స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత్ అసలైన సవాల్‌కు సిద్ధమైంది. నేటి నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భారత్, ఆసీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ప్రపంచకప్ ఆరంభానికి ముందు జట్టు బలాబలాలను పరీక్షించుకోవడానికి ఇదే మంచి అవకాశం. లోపాలను సరిదిద్దుకోవడానికి, కూర్పును సెట్ చేసుకోవడానికి, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకు రావడానికి దీనికంటే మంచి సమయం లేదు. మరి భారత్ ఈ వన్డే సిరీస్‌ను ఎలా సద్వినియోగం చేసుకుంటుందో? చూడాలి.
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లకు తొలి రెండు వన్డేల్లో బీసీసీఐ సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. రోహిత్ గైర్హాజరీలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. జోరుమీదున్న ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం టీమిండియాకు పెద్ద సవాలే. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఓడినప్పటికీ.. ఆసీస్ మంచి ఫామ్‌లో ఉంది. సీనియర్లు లేకపోవడంతో ఆసీస్ నుంచి రాహుల్ సేనకు గట్టి పోటీ ఎదురుకానుంది.
ఈ సిరీస్‌లో అందరి దృష్టి శ్రేయస్ అయ్యర్‌పైనే ఉంది. ఫిట్‌నెస్‌తో ఉన్నాడా?, ప్రపంచకప్‌లో ఆడతాడా? అన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో నేడు శ్రేయస్ బరిలోకి దిగుతాడో లేదో చూడాలి. వెన్ను గాయం కారణంగా ఆరు నెలల తర్వాత ఆసియా కప్‌లో పునరాగమనం చేసినా.. మళ్లీ వెన్ను సమస్యతో ఇబ్బందిపడ్డాడు. కేవలం రెండు మ్యాచ్‌లు ఆడడంతో శ్రేయస్ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. శ్రేయస్ ఇప్పుడు బాగానే ఉన్నాడని బీసీసీఐ చెపుతున్నా.. అతడు ఎంత ఫిట్‌గా ఉన్నాడన్నది ఈ సిరీస్‌తో తేలిపోనుంది.
Also Read: Stock Market: మూడు రోజుల్లో 1700పాయింట్లు నష్టం.. దాదాపు రూ.6లక్షల కోట్ల సంపద ఆవిరి
తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. అతడికి ఈ సిరీస్ మంచి అవకాశం అని చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్‌కు ఈ సిరీస్ పెద్ద పరీక్ష. ప్రపంచకప్‌కు ఎంపికైనప్పటికీ.. వన్డే సామర్థ్యంపై సందేహాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను నిరూపించుకోడానికి, ప్రపంచకప్ తుది జట్టులో తాను ఉన్నానని చెప్పడానికి ఈ సిరీస్ సూర్యకు చక్కని అవకాశం. గిల్, రాహుల్, ఇషాన్ ఫామ్‌లో ఉండడంతో భారత్‌కు కలిసొచ్చే అంశం. వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌కు ఇది మంచి అవకాశం. జడేజా, బుమ్రా, సిరాజ్‌ల ఫామ్ టీమిండియాకు కలిసొచ్చే అంశం.