IND vs AUS 1st ODI Pitch Report and Live Streaming Details: స్వదేశంలో వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మొహాలీ వేదికగా ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో.. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత సారథిగా వ్యవహరించనున్నాడు. రోహిత్ సహా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు కూడా ఈ మ్యాచ్‌లో లేకపోవడంతో.. పటిష్ట ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడం కష్టమే అని చెప్పాలి. అయితే మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుంది. భారత బ్యాటర్లు చెలరేగితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. నేడు జరిగే మ్యాచ్ వికెట్‌ను కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చినట్లు తెలుస్తోంది. దాంతో ఇరు జట్ల బ్యాటర్లు పండగ చేసుకోనున్నారు. గిల్, రాహుల్, ఇషాన్, స్మిత్, స్టోయినిస్, వార్నర్, గ్రీన్ లాంటి బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంది. నేటి వన్డేలో భారీ స్కోర్స్ నమోదయ్యే అవకాశం ఉంది.
ఐఎస్ బింద్రా స్టేడియంలో ఆడిన చివరి 5 మ్యాచ్‌లలో నాలుగు సార్లు మొదట బౌలింగ్ చేసిన జట్టే గెలిచింది. ఒక్కసారి మాత్రమే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్ భారత్ పేరిటే ఉంది. 2017 శ్రీలంకపై భారత్ 392 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (208) డబుల్ సెంచరీ బాదాడు.
మొహాలీలో గత నాలుగేళ్లుగా ఒక్క వన్డే కూడా జరగలేదు. అయితే రెండేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రం జరిగాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ బ్యాటర్లే పైచేయి సాధించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ఎటువంటి వర్షసూచన లేదు. టాస్ మధ్యాహ్నం 1 గంటకు పడనుండగా.. మ్యాచ్ 1.30కి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో ప్రసారం కానున్నాయి.