రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కోటా నగరంలోని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల కారణంగా భార్య తన భర్తపై కత్తితో దాడి చేసింది. కడుపులో బలమైన గాయం కావడంతో భర్త రక్తపు మడుగులో పడ్డాడు. అతన్ని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. వీరిద్దరికీ 10 నెలల క్రితమే వివాహమైంది. యువకుడి కుటుంబ సభ్యులు యువతిపై, ఆమె తల్లిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అత్తమామలతో కలిసి జీవిస్తున్న షారుక్..
వివాహమైనప్పటి నుంచి షారుక్ తన అత్తమామలతో కలిసి జీవిస్తున్నాడని అతని సోదరుడు తెలిపాడు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. 10 నెలల క్రితం షారుక్ కి వివాహం అయ్యింది. అతనికి కుమారుడు కూడా ఉన్నాడు. నవంబర్ 8వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో షారుక్ తన ఇంటికి వచ్చాడు. చాలా విచారంగా కనిపించడంతో ఏం జరిగిందని ప్రశ్నించారు. సాయంత్రం 4 గంటల సమయంలో భార్య నజ్మీన్, అత్త కలిసి తన కడుపుపై కత్తితో దాడి చేశారని తెలిపాడు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నట్లు చెప్పాడు. కడుపుకు పెద్ద కట్టు కూడా కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడి వెంటనే షారుక్‌ను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. అక్కడ అతడికి ఆపరేషన్ జరిగింది. చికిత్స పొందుతున్న బాధితుడు నిన్న రాత్రి 10.30 గంటలకు మరణించాడు.
ఘటనపై పోలీసులు ఏం చెప్పారు?
బాధితుడు విజ్ఞాన్ నగర్ ఛత్రపుర చెరువులో నివాసం ఉంటున్న 30 ఏళ్ల షారుక్ అని సీఐ పుష్పేంద్ర తెలిపారు. లోడింగ్ ఆటో నడుపుతూ ఉండేవాడని చెప్పారు. కుటుంబ కలహాలతో భార్య నజ్మీన్ కత్తితో దాడి చేసిందన్నారు. గత వారం రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారని.. నిన్న రాత్రి మృతి చెందినట్లు వివరించారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. భర్త కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లడంతో భార్య ఆగ్రహం వ్యక్తం చేసిందని అందుకే కత్తితో పొడిచిందని తెలిపారు. బాధిత కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.