NTV Telugu Site icon

Chandrayaan-3: తొలిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రత వివరాలు పంపిన విక్రమ్

Chandrayaan 3

Chandrayaan 3

Chandrayaan-3: అంతరిక్ష పరిశోధన చరిత్రలో మొట్టమొదటిసారిగా చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై నేల ఉష్ణోగ్రతను వివరించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన విక్రమ్ ల్యాండర్‌లోని ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్) పేలోడ్ సహాయంతో చంద్రయాన్-3 చేసిన పరిశోధనలను సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఆగస్టు 23న చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయిన నాలుగు రోజుల తర్వాత ఈ గొప్ప విషయం పరిశోధనలో తెలిసింది. చంద్రుడి ఉపరితలంపై 10సెం.మీ. లోతు వరకు ఉపరితలాన్ని అధ్యయనం చేసిన ప్రజ్ఞాన్ రోవర్ తొట్టతొలిసారి చంద్రుడి దక్షిణ ధృవం వద్దనున్న నేలకి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేసింది. ఈ పరిశీలనలో చంద్రుని దక్షిణ ధృవం వద్ద ఉన్న మట్టిని విశ్లేషించగా.. ఉపరితలం క్రింద 10 సెంటీమీటర్ల వరకు ఉష్ణోగ్రత లోతును బట్టి హెచ్చుతగ్గులను కలిగి ఉందని ఇస్రో తెలిపింది. చంద్రుడి దక్షిణ ధృవం నేలకి సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చుతగ్గుల సమాచారం ప్రపంచానికి చేరడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చంద్రునిపై చేసిన పరిశోధనల్లో ప్రోబ్‌ లోతుకు చొచ్చుకు పోతున్న కొలది ఉష్ణోగ్రతలు నమోదు చేయబడ్డాయి. లోతు పెరుగుతున్న కొద్దీ చంద్రుని ఉపరితలం ఉష్ణోగ్రత తగ్గుతుందని తెలిసింది.

Read ALso: Viral Video: యమధర్మరాజు లీవ్ లో ఉన్నట్టున్నాడు.. లైక్స్ కోసం క్రేజీ స్టంట్ చేసిన యువకుడు

చంద్రుని ఉపరితలం ఉష్ణ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి, ధ్రువం చుట్టూ ఉన్న చంద్రుని ఉపరితలం ఉష్ణోగ్రత ప్రొఫైల్‌ను ChaSTE (చంద్ర యొక్క ఉపరితల థర్మోఫిజికల్ ప్రయోగం) కొలుస్తుందని ఇస్రో ట్వీట్‌లో వివరించింది. ఇది ఉపరితలం క్రింద 10 సెంటీమీటర్ల లోతును చేరుకోగల నియంత్రిత వ్యాప్తి మెకానిజంతో కూడిన ఉష్ణోగ్రత ప్రోబ్‌ను కలిగి ఉంది. ప్రోబ్‌లో 10 వ్యక్తిగత ఉష్ణోగ్రత సెన్సార్‌లు అమర్చబడి ఉన్నాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) సహకారంతో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లోని స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ (SPL) నేతృత్వంలోని బృందం ఈ పేలోడ్‌ను అభివృద్ధి చేసింది. ఇస్రో ట్విటర్‌లో షేర్‌ చేసిన వివరాల ప్రకారం.. ” గ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నుండి 60 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ‘ఈ గ్రాఫ్‌ చంద్రుని ఉపరితలంపై లోతు వ్యత్యాసాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను సూచిస్తోంది. చంద్రుని దక్షిణ ధృవానికి సంబంధించి ఇదే మొట్టమొదటి అధ్యయనం. ఇంకా లోతైన పరిశీలనలు జరుగుతున్నాయి’ అని ఇస్రో ట్వీట్ చేసింది.

Read Also: France: ఇది తెలిస్తే మందుబాబుల గుండె పగిలిపోతుంది.. ఆల్కహాల్ ను కొని నాశనం చేస్తున్న ప్రభుత్వం

చంద్రయాన్-3లో మొతం ఏడు పేలోడ్‌లు ఉండగా అందులో విక్రమ్ ల్యాండర్ నాలుగు, ప్రజ్ఞాన్ రోవర్ రెండు నిర్వహించనుండగా ఒకటి మాత్రం ప్రపల్షన్ మాడ్యూల్ నిర్వహించనుంది. ఈఏడు పేలోడ్‌లు ఒక్కొక్కటీ కొన్ని శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తాయి. అన్ని ప్రణాళికాబద్ధమైన రోవర్ కదలికలు ధృవీకరించబడ్డాయని, రోవర్ దాదాపు 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా అధిగమించిందని, రోవర్ పేలోడ్‌లు LIBS, APXSలు ఆన్ చేయబడ్డాయని ఇస్రో ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్‌లు పని చేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS) చంద్రుని ఉపరితలం రసాయన కూర్పు, ఖనిజ సంబంధమైన కూర్పును ఊహించడం లక్ష్యంగా పెట్టుకుంది. లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) చంద్రుని ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న చంద్రుని నేల, రాళ్ల మూలక కూర్పు (Mg, Al, Si, K, Ca, Ti, Fe)ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ల్యాండర్ పేలోడ్‌లు ILSA, RAMBHA, ChaSTEలను ఆన్ చేసినట్లు ఇస్రో గురువారం తెలిపింది. ILSA పేలోడ్‌ ల్యాండింగ్ సైట్ చుట్టూ భూకంప కార్యకలాపాలను కొలుస్తుంది. RAMBHA చంద్రుని చుట్టూ ఉన్న ప్లాస్మా వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ChaSTE పేలోడ్‌ చంద్రుని ఉపరితల ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది.

 

Show comments