వక్ఫ్ సవరణ బిల్లుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్‌పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు సహనం, వైవిధ్యానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. ఈ బిల్లు ద్వారా అందరికీ రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూనే, ఇమ్రాన్ మసూద్ తాజాగా ఏర్పడబోయే బోర్డు గురించి ప్రస్తావించారు. వక్ఫ్ బోర్డులో 22 మంది సభ్యులు ఉంటారని, వారిలో 10 మంది మాత్రమే ముస్లింలు ఉంటారన్నారు. ఈ విధంగా.. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సోదరుల మెజారిటీ ఉంటుందని చెప్పారు.
READ MORE: LRS Date Extended: అప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపు గడువు పెంచిన ప్రభుత్వం
భీమ్‌రావ్ అంబేద్కర్ రాజ్యాంగం పౌరులందరికీ రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చిందని ఇమ్రాన్ మసూద్ అన్నారు. సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించదని తెలిపారు. రాజ్యాంగం అందరికీ సమానత్వాన్ని హామీ ఇస్తుందని చెప్పారు.. వక్ఫ్ బిల్లును రూపొందించిన వారికి వక్ఫ్ గురించి అవగాహన లేదని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అన్నారు. వక్ఫ్ గురించి ముస్లింలు మాత్రమే అర్థం చేసుకుంటారన్నారు. ప్రతి ముస్లిం, తన సామర్థ్యం మేరకు అల్లాహ్ పేరిట తన ఆస్తిని లేదా మరేదైనా వస్తువును వక్ఫ్ చేస్తాడని చెప్పారు. ఇప్పుడు బిల్లును రూపొందించిన వారిలో చాలా మందికి వక్ఫ్ గురించి తెలియదని విమర్శించారు.
వివిధ రాష్ట్రాల బోర్డులు వివాదాస్పద వక్ఫ్ ఆస్తుల సంఖ్య గురించి ఆయన తెలియజేశారు. తాజా వక్ఫ్ బిల్లులో వివాదం లేని ఆస్తి మాత్రమే బోర్డు పరిధిలోకి వస్తుందని రాసినట్లు తెలిపారు. యూపీలో 11,5000 హెక్టార్ల వక్ఫ్ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించారని చెప్పారు. ఆ భూమి వివాదాస్పదంగా ఉంద కాబట్టి.. కొత్త బిల్లు ప్రకారం ఈ ఆస్తి ఇకపై వక్ఫ్ కాదన్నారు. వక్ఫ్ ఆస్తికి సంబంధించిన వివాదాలను విచారించే అధికారం ఇప్పుడు ట్రిబ్యునల్ నుంచి తీసేస్తారన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. వక్ఫ్ ఆస్తిని ఆక్రమించిన వారు కూడా వెళ్లి తమ హక్కును పొందగలుగుతారన్నారు. ఈ పాయింట్లను చాలా మంది వాడుకుని వక్ఫ్ ఆస్తులను సులభంగా ఆక్రమించుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు.