Interest Rates: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని సాధారణ స్థితికి తెచ్చే వరకూ వడ్డీ రేట్లు పెంచుతూ పోవాలని సెంట్రల్ బ్యాంకులకు ఆమె సూచించారు. యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచబోతుందన్న అంచనాల మధ్య ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా ఈ సలహా ఇచ్చారు. వడ్డీ రేట్ల పెంపు ద్వారా ప్రపంచవ్యాప్తంగా సానుకూల ప్రభావం రావాలంటే 2024 వరకు ఆగాల్సి ఉంటుందన్నారు. ద్రవ్యోల్బణం అధిక స్థాయికి చేరినప్పుడు వృద్ధి మందగిస్తుందని.. కానీ అధిక ద్రవ్యోల్బణం పేదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Read Also: Indian Space Congress-2022: స్పేస్ టెక్ స్టార్టప్‌లకు ‘ఇండియన్’ ప్రోత్సాహం
ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా అక్కడ ఆహారం, ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. సాధారణంగా వడ్డీ రేట్లు పెంచడం వల్ల డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తాయన్న అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ పోతాయి. యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల వడ్డీ రేట్లు పెంచింది. యూరో జోన్‌లో ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 9.9 శాతానికి పెరగడంతో సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐఎంఎఫ్ అంచనాలను గమనిస్తే మరో ఏడాది పాటు వడ్డీ రేట్లు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఫలితం కారణంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి.