Heavy Rains: ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, చిరు జల్లులు పడుతున్నాయి.. అయితే, రానున్న ఐదు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ జిల్లాలో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ).
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది.. ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారి ఆ తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఈ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్స్యకారులు వేటకు వెళ్లకూడదంటూ నిషేధం విధించింది.. మరోవైపు.. గత 24 గంటల్లో అత్యధికంగా అల్లూరి జిల్లా చింతూరులో 18 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.
మరోవైపు తెలంగాణలో ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరిజిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉండగా.. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట అక్కడక్కడ కురిసే అవకాశం ఉండగా.. జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల మోసర్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈదురు గాలులు వేగం గంటకు 40-50 కిలోమీటర్లుగా ఉండే అవకాశం ఉంది.