హైదరాబాద్‌లో గతేడాది విషాదం నెలకొంది. లంగర్ హౌజ్ లో చైనా మాంజా దారం మెడకు చుట్టుకుని ఆర్మీ జవాన్ మృతి చెందాడు. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ వద్ద సైనికుడి మెడకు మాంజా చుట్టుకుని ప్రమాదం జరిగింది. విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్న సైనికుడికి ఈ ప్రమాదం జరిగింది. మాంజా మెడకు చుట్టుకోవడంతో సైనికుడికి తీవ్రగాయాలు అయ్యాయి. అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సైనికుడు కోటేశ్వరరావు మృతి చెందాడు.
చైనా మాంజా బాధితులు..
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో నిషేధిత చైనా మాంజా ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడంతో అతని మెడకు తీవ్రంగా గాయమైంది. ఈ ఘటనలో రక్తస్రావం అధికంగా కావడంతో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు అతనిని కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం తర్వాత హైదరాబాద్‌కి తరలించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చైనా మాంజా బాధితులు చాలా మంది ఉన్నారు. ఈ చైనా మాంజా మెడకు చుట్టుకుని ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
రాజ్యమేలుతున్న చైనా మాంజా…
సంక్రాంతి అంటే నగరంలో పతంగులే గుర్తుకు వస్తాయి. ఈ పండగకు వారంరోజుల ముందు నుంచే చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేకుండా గాలిపటాలను ఎగరవేసేందుకు ఆసక్తి చూపిస్తారు. గతంలో ఈ పతంగులను ఎగరేసేందుకు కాటన్ మాంజాను వాడేవారు. పోటీ పెరగడంతో మాంజా దారానికి గాజు పిండి, సాబుదానా(సగ్గుబియ్యం), గంధకం, రంగులు వేసి మాంజాను తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో ప్రమాదకరమైన‘చైనా మాంజా’ రాజ్యమేలుతోంది.
పక్షులకూ హానీ..
పతంగుల మాంజా వల్ల పక్షుల మీద గాయాలు, మరణాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. గాలిలో స్వేచ్ఛగా ఎగరే పక్షులు చైనా మాంజా తగిలి గాయపడటం అనివార్యం అవుతోంది. ఈ కారణంగా పక్షుల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించి చైనా మాంజాను పూర్తిగా నిషేధించడంపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగరేసేవారు చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. చైనా మాంజా వల్ల తలెత్తే ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లు , మార్కెట్‌లో ఈ నిషేధిత మాంజా విక్రయాన్ని నియంత్రించేందుకు అధికారాలు మరింత చురుకుగా ఉండాలని కోరుతున్నారు.
ఫిర్యాదు చేయండిలా..
అయితే.. రాష్ట్ర ప్రభుత్వం 2017, జూలై 11న ఈ చైనా మాంజాను నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. ఈ చైనా మాంజాను అమ్మినా, కొన్నా నేరమేనంటూ ఇటీవల హైదరాబాద్ పోలీసులు మరోసారి ట్వీట్ ద్వారా చేశారు. ఎవరైనా చైనా మాంజా అమ్మితే 9490616555 నంబర్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.