ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రధాని మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి పోతుందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అభ్యర్థి టీఆర్ బాలుకు సపోర్టుగా శ్రీపెరంబుదూర్లో జరిగిన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా సైన్స్ కూడా వెనక్కి పోతుంది.. అప్పుడు మూఢనమ్మకాలతో కూడిన కథలకు ప్రాధాన్యత వస్తుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ నియమాలతో పూర్తిగా నిండిపోతుందన్నారు. అలా జరగకూడదంటే.. దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడం ఒక్కటే ఆయుధం అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.
Read Also: Tillu Square : టిల్లు గాడు ఈ సారి గట్టిగానే కొట్టాడుగా..?
ఇక, బీజేపీకి ఓటేస్తే తమిళనాడు శత్రువుకు వేసినట్లే అని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దుయ్యబట్టారు. అన్నాడీఎంకేకు వేసిన ఓటు రాష్ట్ర ద్రోహులకు వేసినట్లేనన్నారు. ఏఐఏడీఎంకే, బీజేపీ పార్టీలు సహజ మిత్రపక్షాలని పిలిచే వారు.. కానీ ఇప్పుడు అవి విడిపోయినట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ అవసరమైతే బీజేపీకి మద్దతు ఇస్తారా అని మీడియా ఏఐఏడీఎంకేను క్వశ్చన్ చేసినప్పుడు.. ఎడప్పాడి కె. పళనిస్వామి అన్నాడీఎంకే మద్దతు ఇవ్వదని చెప్పలేదు.. ‘వెయిట్ అండ్ సీ’ అని ఆన్సర్ చెప్పినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీకి ఎప్పటికీ వ్యతిరేకం కాదు.. ఆ పార్టీకి ఓటేస్తే భారతీయ జనతా పార్టీకి వేసినట్లే అని తమిళనాడు ముఖ్యమంత్రి మండిపడ్డారు.