కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చిందంటే చాలు బ్యాంకులు వడ్డన మొదలు పెడుతుంటాయి. మరోసారి కస్టమర్ల జేబులకు చిల్లు పెట్టేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆ ఛార్జీలు.. ఈ ఛార్జీలు అంటూ భారీగా వడ్డిస్తున్నాయి. తాజాగా మరికొన్ని బ్యాంకులు అదే బాట పట్టాయి. పలు ప్రముఖ దేశీయ బ్యాంకులు వడ్డనకు సిద్ధమయ్యాయి. పెంచిన కొత్త సర్వీస్ ఛార్జీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యాక్సిస్, యెస్ బ్యాంకులు సవరించాయి. ఇప్పటికే పలు బ్యాంకులు పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలవుతున్నాయి. తాజాగా ఈ మూడు బ్యాంకులు కూడా పెంచేశాయి.
ఐసీఐసీఐ బ్యాంక్..
చెక్‌బుక్‌లు, ఐఎంపీఎస్ లావాదేవీలు, ఈసీఎస్/ఎన్‌ఏసీహెచ్ డెబిట్ రిటర్నుల వంటి ఛార్జీలను ఐసీఐసీఐ బ్యాంక్ సవరించింది.
డెబిట్ కార్డు ఫీజు: ఏడాదికి రూ.200; గ్రామీణ ప్రాంతాల్లో రూ.99
చెక్ బుక్: తొలి 25 చెక్‌లు ఉచితం. తర్వాత ప్రతీ చెక్‌కు రూ.4
డీడీ/పీఓ ఫీజు: రద్దు, డ్యూప్లికేట్, రీవ్యాలిడేషన్‌కు రూ.100
సిగ్నేచర్ అటెస్టేషన్: ఒక్కో అప్లికేషన్‌కు రూ.100
ఈసీఎస్/ఎన్‌ఏసీహెచ్ డెబిట్ రిటర్నులు: ఒక్కోసారికి రూ.500
స్టాప్ పేమెంట్: ఒక్కో చెక్‌కు రూ.100 (ఐవీఆర్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే ఉచితం)
ఖాతా మూసివేత, డెబిట్ కార్డు పిన్ రీజనరేషన్, డెబిట్ కార్డు డీ-హాట్‌లిస్టింగ్, బ్యాలెన్స్ సర్టిఫికెట్, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ వంటి సేవలకు ఎలాంటి రుసుము లేదు.
యాక్సిస్ బ్యాంక్..
యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతా టారిఫ్ నిర్మాణాన్ని అప్‌డేట్ చేసింది. పొదుపు మరియు సాలరీ ఖాతాల కనీస నిల్వ అవసరాలు, అలాగే నగదు లావాదేవీల పరిమితులను ప్రభావితం చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఈ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.
నెల బ్యాలెన్స్..
గతంలో ప్రతి త్రైమాసిక సగటు కనిష్ఠ బ్యాలెన్స్ పరిమితి రూ.2,00,000. ఇప్పుడు దాన్ని నెలకు సవరించింది. అంటే ప్రతినెల సగటు బ్యాలెన్స్ రూ.2,00,000 ఉండాలి. లేదంటే గరిష్ఠంగా ఖాతాను బట్టి రూ.600 రుసుము వసూలు చేస్తారు.
నగదు లావాదేవీ పరిమితి..
ప్రైమ్, లిబర్టీ, ప్రెస్టీజ్, ప్రియారిటీ సేవింగ్స్ ఖాతాల్లో నెలకు రూ.25,000 వరకు థర్డ్ పార్టీ లావాదేవీలు ఉచితం. తర్వాత ప్రతి రూ.1,000కి రూ.10 రుసుము చెల్లించాలి. ప్రైమ్, లిబర్టీ ఖాతాల్లో నెలకు ఐదు లావాదేవీలు- గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఉచితం. ప్రెస్టీజ్‌లో ఐదు లావాదేవీలు- గరిష్ఠంగా రూ.2 లక్షలు, ప్రియారిటీలో ఏడు లావాదేవీలు- గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మరోవైపు వరుసగా రెండు నెలల పాటు శాలరీ ఖాతాలో వేతనం క్రెడిట్ కాకపోతే నెలకు రూ.100 ఫీజు చెల్లించాలి.
యస్ బ్యాంక్..
పొదుపు ఖాతా ఛార్జీల షెడ్యూల్‌ను యస్ బ్యాంక్ అప్‌డేట్ చేసింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ మార్పులు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. అదనంగా బ్యాంక్ కొన్ని ఖాతా రకాలను నిలిపివేసింది.
బ్యాలెన్స్ నిబంధనలు..
సేవింగ్స్ ప్రో మ్యాక్స్: రూ.50,000. లేదంటే గరిష్ఠంగా రూ.1,000 వరకు ఛార్జి.
సేవింగ్స్ ప్రో ప్లస్, యెస్ ఎసెన్స్, యెస్ రెస్పెక్ట్: రూ.25,000. లేదంటే గరిష్ఠంగా రూ.750 ఛార్జి.
సేవింగ్స్ ప్రో: రూ.10,000. లేదంటే గరిష్ఠంగా రూ.750 ఛార్జి.
సేవింగ్స్ వాల్యూ, కిసాన్ ఎస్‌ఏ: రూ.5,000. లేదంటే గరిష్ఠంగా రూ.500 ఛార్జి.
మై ఫస్ట్ యెస్: రూ.2,500. లేదంటే గరిష్ఠంగా రూ.250 ఛార్జి.
డెబిట్ కార్డు ఛార్జీలు..
ఎలిమెంట్: రూ.299
ఎంగేజ్: రూ.399
ఎక్స్‌ప్లోర్: 599
రూపే (కిసాన్ అకౌంట్): రూ.149
ఏటీఎం లావాదేవీ ఛార్జీలు..
ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు లావాదేవీలు ఉచితం. తర్వాత ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ.21, ఆర్థికేతర లావాదేవీకి రూ.10 రుసుము చెల్లించాలి.