NTV Telugu Site icon

Champions Trophy 2025: ఐసీసీ కోర్టులో బంతి.. నేడు తేలనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ భవితవ్యం!

Champions Trophy 2025

Champions Trophy 2025

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్‌ నిరాకరించడంతో.. టోర్నీ షెడ్యూల్‌పై సందిగ్ధత నెలకొంది. హైబ్రిడ్‌ మోడల్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తే తాము ఆడేందుకు సిద్ధమని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఇందుకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. పాకిస్థాన్‌లోనే పూర్తి టోర్నీ జరగాలని పట్టుపడుతోంది. ఐసీసీ చర్చలు జరిపినా.. పాక్ వెనక్కి తగ్గడం లేదు. హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకరించేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి పీసీబీ స్పష్టం చేసింది. ఇందుకు బీసీసీఐ ఒప్పుకునే అవకాశం లేకపోవడంతో.. బంతి ఇప్పుడు ఐసీసీ కోర్టులో ఉంది.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ కోసం ప్రస్తుతం ఐసీసీ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. హైబ్రిడ్‌ మోడల్‌లో మెజారిటీ మ్యాచ్‌లను పాక్‌లో నిర్వహించి.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడించాలని ఐసీసీ బావిస్తోంది. ఇందుకు పీసీబీ ఒప్పుకోకుంటే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ మొత్తాన్ని పాకిస్థాన్‌ వెలుపల నిర్వహించాలన్నది మరో ప్రత్యామ్నాయం. టోర్నీని పాక్ నుంచి తరలించినా.. ఆతిథ్య హక్కులు మాత్రం పీసీబీ వద్దే ఉంటాయి. భారత్‌ లేకుండా పాక్‌లోనే టోర్నీ నిర్వహించాలన్నది మరో ప్రత్యామ్నాయం. ఐసీసీ ఇప్పుడు ఈ మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.

Also Read: WPL 2025: డిసెంబర్ 15న ఐపీఎల్‌ వేలం.. వేదిక ఎక్కడంటే?

భారత్ లేకుండా ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహిస్తే ఆర్థికంగా భారీ నష్టం కలుగుతుంది కాబట్టి.. ఐసీసీ మూడో ప్రత్యామ్నాయంను పరిశీలించడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. మొదటి ప్రత్యామ్నాయానికి భారత్‌, ఐసీసీ మొగ్గు చూపుతుండగా.. పాకిస్తాన్ మాత్రం ససేమిరా అంటోంది. ఇక రెండో ప్రత్యామ్నాయాన్ని ఐసీసీ పరిశీలిస్తుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీని పాక్ నుంచి తరలించాలని ఐసీసీ చూస్తోంది. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో రాజకీయ ఆందోళనలు జరుగుతుండటం కూడా మరో కారణం. నేడు వర్చువల్‌గా జరిగే సమావేశంలో టోర్నీ షెడ్యూల్‌పై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.

Show comments