HCA Asks BCCI to Make Changes in ICC ODI World Cup 2023 Schedule: అక్టోబర్ 5 నుంచి భారత్ గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీ కోసం భారత్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రపంచకప్ 2023 కోసం అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. కొన్ని టీమ్‌లు ఇప్పటికే తమ ప్రాథమిక జట్లనూ ప్రకటించాయి. ఫాన్స్ టిక్కెట్లు బుక్ చేసుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే టోర్నీ సమీపిస్తున్నా కొద్దీ.. సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) భద్రతాపరమైన విషయం లేవనేత్తగా.. తాజాగా హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కూడా అదే దారిలో నడిచింది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా మూడు ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 6న పాకిస్థాన్-నెదర్లాండ్స్, అక్టోబర్ 9న న్యూజిలాండ్-నెదర్లాండ్స్, అక్టోబర్ 10న పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌లు ఉన్నాయి. వరుస రోజుల్లో రెండు మ్యాచులు ఉండడంతో సెక్యూరిటీని కల్పించడం ఇబ్బందిగా మారుతుందని హైదరాబాద్ పోలీస్ విభాగం హెచ్‌సీఏకు తెలిపి ఆందోళన వ్యక్తం చేసిందట. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టికి హెచ్‌సీఏ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హెచ్‌సీఏ విజ్ఞప్తిపై బీసీసీఐ, ఐసీసీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
ఐసీసీ రిలీజ్ చేసిన తొలి షెడ్యూల్ ప్రకారం.. పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 12న జరగాలి. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను ఒకరోజు ముందుకు అక్టోబర్ 14కి రీషెడ్యూల్ చేశారు. దీంతో పాక్ జట్టుకు తగినంత సమయం ఇవ్వడానికి శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్‌ను అక్టోబర్ 10కి మార్చారు. ఇక కోల్‌కతా వేదికగా జరగనున్న పాకిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్ కూడా నవంబర్ 12కి బదులుగా 11న రీషెడ్యూల్ అయింది. దాంతో హైదరాబాద్ పోలీసులు సెక్యూరిటీని కల్పించడం ఇబ్బందిగా మారుతుందని హెచ్‌సీఏకి తెలిపారు.
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. బీసీసీఐకి హెచ్‌సీఏ లేఖ రాసింది. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య సమయం కావాలని కోరింది. భద్రతా ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని మ్యాచుల తేదీని మార్చాలని బీసీసీఐని హెచ్‌సీఏ కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. టిక్కెట్స్ బుక్ చేసుకోవాలా? వద్దా? అనే డైలమాలో పడ్డారు. షెడ్యూల్ ఖరారు చేసేముంద క్రికెట్ అసోసియేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు శాఖ అభిప్రాయాలను బీసీసీఐ తీసుకోలేదా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
Also Read: Asia Cup 2023: హార్దిక్ పాండ్యాకు షాక్.. టీమిండియా కొత్త వైస్ కెప్టెన్‌గా..!
ఇప్పటికే ప్రపంచకప్ 2023 మ్యాచుల టికెట్ల విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25 నుంచి అధికారికంగా విక్రయాలు ఆరంభం అవుతాయి. భారత్ ఆతిథ్యం ఇస్తోన్న మెగా టోర్నీకి దేశవ్యాప్తంగా పది వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం కూడా ఉంది. ఉప్పల్ స్టేడియంలో భారత్ ఆడే మ్యాచ్‌లు లేవు అన్న సంగతి తెలిసిందే.