వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై సందిగ్ధతకు తెర పడినట్లు తెలుస్తోంది. ట్రోఫీ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. భారత్ ఆడే మ్యాచ్‌లకు దుబాయ్‌లో నిర్వహించనుంది. అంతేకాదు 2027 వరకు జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్‌లో పాకిస్తాన్ పర్యటించకుండా.. హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించేందుకు ఐసీసీ అంగీకరించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
2025 ఫిబ్రవరి, మార్చిలో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈ టోర్నీ కోసం పాక్‌కు టీమిండియాను పంపమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. హైబ్రిడ్ మోడల్‌లో ఆడేందుకు తాము సిద్దమని ఐసీసీకి తెలిపింది. ఇందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒప్పుకోలేదు. ఐసీసీ మధ్యవర్తిత్వం చేసినా ఫలితం లేకుండా పోయింది. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకుంటే టోర్నీని పాక్ నుంచి తరలిస్తామని పీసీబీకి ఐసీసీ తేల్చి చెప్పింది. ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాక్.. ఓ కండిషన్ పెట్టింది. 2031 వరకు భారత్ ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ టోర్నీల్లో పాక్ మ్యాచ్‌లను కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తామంటేనే.. ఇప్పుడు హైబ్రిడ్ విధానం ప్రతిపాదనకు అంగీకరిస్తామని పీసీబీ మెలిక పెట్టింది.
Also Read: AUS vs IND: నా కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదు.. భారత్ సిద్ధంగా ఉండాలి: రవిశాస్త్రి
ఐసీసీ ఛైర్మన్ జై షా, బోర్డు సభ్యుల మధ్య గురువారం అనధికార సమావేశం జరిగింది. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ సందిగ్ధతకు తెరదించుతూ.. ఐసీసీ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ వర్గాలు తెలిపాయి. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ మ్యాచ్‌లు భారత్ వెలుపల జరగనున్నాయి. పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను శ్రీలంకతో కలిసి ఉమ్మడిగా భారత్ నిర్వహించనుంది. ఈ టోర్నీలోని పాక్ మ్యాచ్‌లకు లంకలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతో టీమిండియాకు షాక్ తగిలింది. తమ దేశంలో ఎలాంటి సెక్యూరిటీ సమస్య లేదని, ఐసీసీ మ్యాచ్‌లను ఇక్కడే నిర్వహిస్తామని బీసీసీఐ తెలపగా.. ఐసీసీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.