ఎన్నో ప్రతికూలతల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్.. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరిసి అద్భుత విజయం సాదించిన టీమిండియా.. ఇక రెండో టెస్టుకు సిద్ధమైంది. అయితే అడిలైడ్‌లో గత పర్యటన అనుభవం భారత జట్టుకు హెచ్చరికలు పంపుతోంది. అడిలైడ్ మైదానంలో గత పర్యటనలో ఆడిన టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అందుకోలేదు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే టాప్.
Also Read: IND vs AUS: నేటి నుంచే భారత్, ఆస్ట్రేలియా ‘పింక్’ టెస్టు.. ఓపెనర్‌గా రాహుల్! టాస్ కీలకం
అయితే అడిలైడ్‌లో డే/నైట్ టెస్టుకు సిద్ధమైన భారత్‌ను 2020 నాటి చేదు అనుభవం వెంటాడుతుందని తాను అనుకోవట్లేదని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఐసీసీ రివ్యూ తాజా ఎపిసోడ్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ… ‘2020లో అడిలైడ్‌లో భారత్ 36 పరుగులకే కుప్పకూలింది. ఆ సంఘటన ఇప్పుడు అదే మైదానంలో ఆడుతున్న భారత జట్టును వెంటాడుతుందని నేను అనుకోను. కానీ గులాబి బంతితో పరిస్థితులు వేగంగా మారిపోతాయి. ఈ విషయంలో మాత్రం రోహిత్ సేన సిద్ధంగా ఉండాలి. ఆరోజు బంతి దూసుకు రావడం.. బ్యాట్‌కు తాకి క్యాచ్ వెళ్లడం జరిగింది. ఒక సెషన్‌లో అంత వేగమైన పతనాన్ని నా కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుత సిరీస్‌లో ఒత్తిడి మొత్తం ఆస్ట్రేలియా పైనే ఉంది. అడిలైడ్‌లో రాణించి.. సిరీస్‌లో పట్టు బిగించే అవకాశం భారత్ ముందుంది’ అని తెలిపాడు.