Jonty Rhodes About India fielding coach Role: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికమెండ్ చేసినా తనకు ఫీల్డింగ్ కోచ్‌గా అవకాశం రాకపోవడంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీమిండియాకు అంతర్జాతీయ కోచ్ అవసరం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లుందన్నారు. తాను లోకల్ అని, తనది గోవా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌లుగా వ్యవహరించిన దిలీప్, శ్రీధర్ మంచి పనితీరు కనబరిచారని జాంటీ రోడ్స్ ప్రశంసించాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన అలీనా డిసెక్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ఓ పోడ్‌కాస్ట్ సందర్భంగా జాంటీ రోడ్స్ మాట్లాడుతూ.. టీమిండియా ఫీల్డింగ్ కోచింగ్‌పై స్పందించాడు. ‘టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ కోచ్‌గా నన్ను కోరినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. బీసీసీఐ తిరస్కరించడం నాకు నమ్మశక్యం కానిదిగా ఉంది. టీమిండియాకు అంతర్జాతీయ కోచ్ అవసరం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లుంది. అయితే నేను లోకల్, నాది గోవా. నా పేరు జాంటీ రోడ్స్. ఫీల్డింగ్ కోచ్‌గా అవకాశం రాకపోవడంపై నిరాశగా ఉన్నా. అయినా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం కదా?’ అని అన్నాడు.
Also Read: Kapil Show Season 2: బాలీవుడ్ షోకు తెలుగు స్టార్ హీరో.. భారత స్టార్ క్రికెటర్స్ కూడా!
‘ఫీల్డింగ్ కోచ్‌లుగా వ్యవహరించిన దిలీప్, శ్రీధర్ బాగా పనిచేశారు. భారత క్రికెట్‌లో చాలా మార్పులు తెచ్చారు. వారికి హ్యాట్సాఫ్. ఎంఎస్ ధోనీ నాయకత్వం నుంచి విరాట్ కోహ్లీ వరకు ఫిట్‌నెస్‌పై తీవ్రస్థాయిలో కృషి చేశారు. ఇప్పుడు అదే కొనసాగుతోంది. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులో చాలా మంది సీనియర్లు ఉన్నారు. మహీ తన ఫిట్‌నెస్‌తో వారికి మార్గదర్శకుడిగా మారాడు. కోహ్లీ నిరంతరం ఫిట్‌నెస్‌పై పెడతాడు. భారత సెలక్షన్ ప్రక్రియకు అదే ఇపుడు నిబంధనగా మారిపోయింది. అందుకే ఫీల్డింగ్‌లో భారత్ అత్యుత్తమంగా తయారైంది’ అని జాంటీ రోడ్స్ తెలిపాడు. హెడ్ కోచ్ అయిన గంభీర్.. తన సహాయ సిబ్బందిని అతడే ఎంచుకున్న విషయం తెలిసిందే.