HYDRA Commissioner: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని ప్రకటించారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే వాటిని హైడ్రా కూల్చదన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్‌లో ఉంటే కూల్చడం జరుగుతుందన్నారు. గతంలో అనుమతులు ఇచ్చి తరువాత వాటిని రద్దు చేస్తే.. ఆ కట్టడాలు అక్రమ కట్టడాలుగా పరిగణిస్తూ.. వాటిని హైడ్రా కూల్చివేస్తుందన్నారు. పేదలను ముందు పెట్టి వెనుక నుండి చక్రం తిప్పుతున్న ల్యాండ్ గ్రాబర్స్‌ని హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. హైడ్రా ఆవిర్భావం తర్వాత అనుమతి ఇచ్చినా ఎఫ్టీఎల్‌లో వుంటే కూల్చడం జరుగుతుందన్నారు.
అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా బాధ్యులను చేయటం జరుగుతుందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతి లేకుండా ఉన్న కన్వెన్షన్ సెంటర్ లాంటి కట్టడాలు హైడ్రా కూల్చి వేస్తుందన్నారు.
హైదరాబాద్‌లో చెరువుల ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే హైడ్రా మొదలు పెట్టిందన్నారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నాం.. త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కూల్చివేతలు చేసిన తరువాత, ఆ ప్రాంతం ప్రజావసరాల కోసం వినియోగంలోకి వచ్చేలా హైడ్రా ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. హైదరాబాద్‌లో 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టామన్నారు. ఆ చెరువుల పునరుద్దరణకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించామన్నారు. ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన వెంటనే పనులు మొదలు పెడతామన్నారు.
Read Also: Folk Singer Suicide: ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ
చెరువులు, పార్కులతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇలాంటి సంస్థ దేశంలోనే మొట్ట మొదటిదని వెల్లడించారు. గత 5 నెలల అనుభవాల నుంచి హైడ్రా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తోందన్నారు. ఏమన్నా లోటు పాట్లు ఉంటే వాటిని సవరించుకొని మరింత దృఢంగా నిబద్ధతతో పని చేస్తోందన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. వివిధ సందర్భాలలో కోర్టులు ఇచ్చిన పలు తీర్పులకు లోబడి హైడ్రా ముందుకు వెళ్తోందన్నారు. భావితరాల భవిష్యత్‌కు మెరుగైన ప్రజా జీవనం కోసం నగర ప్రజలు హైడ్రాకు సహకరిస్తున్నారన్నారు. ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు హైడ్రా పని చేస్తుందన్నారు. హైడ్రాను బలోపేతం చేయడానికి వివిధ చట్టాల కింద ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెడుతూ వస్తోందన్నారు.
టెక్నాలజీ పరంగా కూడా స్ట్రాంగ్ అవుతున్నామన్నారు. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాలను స్వాధీనం చేసుకున్నదని ఆయన వెల్లడించారు. ప్రజలు పెద్ద ఎత్తున హైడ్రా పై నమ్మకంతో ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఇలా 5000లకు పైగా ఫిర్యాదులను హైడ్రా పరిష్కరించిందన్నారు. ఇంకా పలు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం చూపించే దిశగా హైడ్రా పని తీరు ఉంటుందన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని చెప్పారు. భూ కబ్జాల వెనక ఉన్న పాత్ర దారులు, సూత్ర దారుల మీద చట్ట పరంగా కఠిన చర్యలు హైడ్రా తీసుకుంటుందని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.