ఎలక్ట్రీషియన్‌తో కలిసి ఓ ఇంటి యజమాని మాస్టర్ ప్లాన్ వేశాడు. అద్దె ఇంట్లోని బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశారు. బల్బు హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా గమనించిన అద్దెకుంటున్న దంపతులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దెదారులిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు యజమానిని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఎలక్ట్రీషియన్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరం మధురానగర్‌లో చోటుచేసుకుంది.
మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం… జవహర్‌నగర్‌లోని అశోక్ నివాసంలో ఓ జంట అద్దెకుంటున్నారు. ఇటీవల బాత్‌రూమ్‌లో బల్బు పనిచేయకపోవడంతో అద్దెకుంటున్న దంపతులు యజమాని అశోక్‌కు చెప్పారు. అక్టోబర్ 4న ఎలక్ట్రీషియన్ చింటూని ఇంటికి పిలిపించిన అశోక్ బల్బు సెట్ చేయించాడు. అయితే చింటూ, అశోక్ కలిసి బల్బుతో పాటు హోల్డర్‌లో సీక్రెట్ కెమెరాను అమర్చారు. అక్టోబర్ 13న సీక్రెట్ కెమెరాను దంపతులు గుర్తించారు. ఇంటి యజమాని అశోక్‌కి చెప్పడంతో బల్బును మార్చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఎలక్ట్రీషియన్ పగబడతాడని బెదిరించాడు.
ఇంటి యజమాని అశోక్‌పై అనుమానం రావడంతో అద్దెకుంటున్న దంపతులు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని అశోక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో అశోక్ అసలు విషయం చెప్పాడు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటూ కోసం పోలీసులు గాలిస్తున్నారు.