హైదరాబాద్ సారథి స్టూడియోస్‌లో కలకలం రేగింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో వేతనాల పెంపు కారణంగా షూటింగ్‌లు జరగడం లేదు. 30% వేతనాలు పెంచి ఇచ్చిన వారికి మాత్రమే షూటింగ్‌లకు వెళ్లాలని ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయించింది. అలా కొంత మంది వేతనాలు పెంచి షూటింగ్ చేయించుకుంటున్నారు. అయితే, తాజాగా హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో సినీ కాస్ట్యూమర్స్ అసోసియేషన్ సెక్రటరీ, అలాగే ఆ యూనియన్‌లో ఉన్న ఒక సభ్యుడి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కాస్ట్యూమర్స్ అసోసియేషన్ సెక్రటరీ నరసింహ, అదే యూనియన్‌లో సభ్యుడిగా ఉన్న సత్యనారాయణ అనే వ్యక్తిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి గొడవ జరిగి మూడు రోజులు అయిందని ఆగస్టు మూడవ తేదీన ఈ వివాదం జరిగిందని తెలుస్తోంది. ఆరోజు ఒక యాడ్ ఫిలిం షూటింగ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గొడవ పెద్దదై ముందుగా సత్యనారాయణ నరసింహ మీద దాడి చేశారని నరసింహ వెల్లడించారు. అయితే ఈరోజు నరసింహ దాడి చేసినట్టు సత్యనారాయణ ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం షూటింగ్‌లకు హాజరు కాకూడదని ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. అంటే, ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉండే అన్ని యూనియన్ సభ్యులు షూటింగ్‌లకు హాజరు కాకూడదని నిర్ణయించారు. అయినా సరే, షూటింగ్‌కు హాజరైన కారణంగానే ఈ వాగ్వాదం చోటు చేసుకుందని, వాగ్వాదం ముదిరిన కారణంగా చేయి చేసుకునే వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.