Hyderabad: హైదరాబాద్ పరిధిలో చైనా మంజా విక్రయాలపై పోలీసులు దాడులు చేపట్టారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన పోలీసులు, విక్రయానికి సిద్ధంగా ఉంచిన దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన చైనా మంజాను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా చైనా మంజా వినియోగం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఫిర్యాదులు పెరగడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి ప్రత్యేక దృష్టి సారించి ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి ఆర్డర్ ఆధారంగా కొంతమంది దుకాణదారులు చైనా మంజాను తెప్పిస్తున్నట్లు వెల్లడైంది. ఇండస్ట్రియల్ అవసరాల కోసం తయారు చేసే ప్రత్యేక దారాన్ని మాంజాగా ఉపయోగిస్తూ యువకులు గాలిపటాలు ఎగురవేస్తున్నారని పోలీసులు గుర్తించారు. సాధారణ మాంజాతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుండటంతో చైనా మంజా వాడకం పెద్ద ఎత్తున పెరిగిందని అధికారులు తెలిపారు. చైనా మంజా వల్ల పక్షులు, జంతువులు మాత్రమే కాకుండా ద్విచక్ర వాహనదారులు, పాదచారులకు కూడా ప్రాణాపాయం పొంచి ఉందని పోలీసులు హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా చైనా మంజా నిల్వ చేయడం, విక్రయించడం, వినియోగించడం నేరమని స్పష్టం చేసిన అధికారులు, ఈ తరహా కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
బ్యాన్ చేసినా చైనా మాంజా అమ్మకాలు ఆగడం లేదు. ఎక్కడికక్కడ గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుగుతున్నాయి. దీని కారణంగా ఇప్పటికే పలువురు మృతి చెందగా.. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో చైనా మాంజా విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. దీని కారణంగా ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో చైనా మాంజాల వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. నగర ప్రజలు కూడా చైనా మంజా వాడకాన్ని నివారించడంలో సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
READ MORE: YS Jagan: చంద్రబాబు మౌనంగా ఉండటంతోనే శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణ ప్రాజెక్టులు..