Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లాల్‌దర్వాజ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ భవనం నిమిషాల్లోనే మంటలకు ఆహుతైంది. రెండు అంతస్తుల ఈ షోరూంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు విపరీతంగా వ్యాపించాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఒక్కొక్కటిగా పేలిపోవడం వల్ల బాంబులు పడుతున్నట్టు భారీ శబ్దాలు వినిపించాయి. భవనం ముందు పార్క్ చేసి ఉన్న సీఎన్‌జీ కారు కూడా మంటల్లో చిక్కుకుని పేలిపోవడంతో అగ్నికీలలు మరింత ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో కారులో ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
READ MORE: Off The Record: టీడీపీకి అత్యంత సమస్యాత్మకంగా ఆ నియోజకవర్గం..!
ఒక్కసారిగా ఎగిసిన మంటలు రోడ్డుపై వెళ్లే వాహనదారులను, పాదచారులను భయంతో పరుగులు పెట్టించాయి. దుకాణం షట్టర్ సైతం మంటల ధాటికి దాదాపు 100 మీటర్ల దూరంలో పడిపోయింది. షోరూం పక్కనున్న లక్ష్మీ వస్త్ర దుకాణం కూడా మంటలకు గురై సామగ్రి దగ్ధమైంది. పరిసరాల్లో ఉన్న నివాసాల నుంచి ప్రజలను పోలీసులు వెంటనే ఖాళీ చేయించాల్సి వచ్చింది. క్లాక్‌టవర్‌పై ఉన్న గడియారం ప్రమాదం జరిగిన క్షణం 10.28 గంటల వద్దే ఆగిపోయింది.
READ MORE: Disha Patani : ఘాటైన పరువాలు చూపిస్తున్న దిశా పటానీ
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ పెద్ద ఎత్తున స్పందించింది. దాదాపు 8 నుంచి 10 ఫైరింజన్లు వరుసగా చేరి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. సిబ్బంది ప్రాణాలకు తెగించి మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, ఏసీపీ చంద్రశేఖర్ పరిస్థితిని సమీక్షించి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొంతమంది వాహనం భవనానికి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని చెబుతుండగా, మరికొంతమంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భారీ ఆస్తి నష్టం జరిగినట్టు షోరూం యజమానులు చెప్పినా ఖచ్చితమైన లెక్కలు వెలువడాల్సి ఉంది.