చార్మినార్ నియోజకవర్గంలోని లాడ్ బజార్, ఖిల్వత్, ముర్గి చౌక్ ప్రాంతాల స్థానికులు తమ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు ప్రతిరోజూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ‘హర్ట్ ఆఫ్ ది సిటీ’గా పరిగణించబడే చార్మినార్ రద్దీ వీధుల్లో పేరుకుపోయిన చెత్త కుప్పలు, దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న మురుగునీరు ఎక్కువగా కనిపిస్తాయి. చెత్త రోడ్లపై వ్యాపించడం వల్ల దుర్వాసన వెదజల్లుతూ పాదచారులు, ఇతరులు ఆయా ప్రాంతాల్లో తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)లో ఇంటింటికీ చెత్తను సేకరించే యంత్రాంగం ఉన్నప్పటికీ, ఇందుకోసం వినియోగిస్తున్న సిబ్బంది సరిపోవడం లేదు. ఈ ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితి నిర్వాసితులు, వ్యాపార సంస్థలు, వాహనదారులకు పీడకలగా మారింది. చార్మినార్‌లోకి వెళ్లే రోడ్లు జారుడుగా మారడంతో చిన్నపాటి రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఆటోడ్రైవర్ల వంటి రోజువారీ వేతన జీవులు పాడైపోయిన రోడ్ల వల్ల తమ వాహనాలకు నష్టం వాటిల్లుతుందని ఫిర్యాదు చేస్తున్నారు.
Also Read : Madras Eye: తమిళనాడును కలవరపెడుతున్న “మద్రాస్ ఐ” .. ప్రతిరోజూ 4 వేలకు పైగా కేసులు
ఈ ప్రాంతంలో 6 నెలలకు పైగా రోడ్డు పనులు అసమానంగా, ప్రణాళిక లేకుండా జరుగుతున్నాయని వాహనదారులు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల సీఎం కేసీఆర్ రోడ్డు, భవనాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిసెంబర్ రెండో వారంలోపు యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లలో గుంతలు లేకుండా.. అవసరమైతే కొత్త రోడ్లు వేయాలని ఆదేశాలు జారీచేశారు. అయితే ఎప్పుడూ రద్దీగా ఉండే.. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రానికి తలమానికమైన చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితిపై కూడా అధికారులు దృష్టి సారించి.. నూతన రోడ్ల నిర్మాణానికి పూనుకుంటారా చూడాలి మరీ.