Tamil Nadu Sees ‘Madras Eye’ Surge, 1.5 lakh Conjunctivitis Cases In Monsoon: తమిళనాడు వ్యాప్తంతా ‘ మద్రాస్ ఐ ’ కేసుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ భాషలో చెప్పాలంటే ‘ కళ్ల కలక’గా ఈ వ్యాధిని వ్యవహరిస్తుంటారు. ఇప్పటి వరకు తమిళనాడు వ్యాప్తంగా 1.5 లక్షల కళ్లకలక కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజల్లో ఇన్ఫెక్షన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా మద్రాస్ ఐ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతీరోజూ 4,000 నుంచి 4,500 కేసులు నమోదు అవుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. ఒక్క చెన్నై నగరంలోనే రోజుకు 80 నుంచి 100 కేసులు నమోదు అవుతున్నాయి. ఈ వ్యాధి సోకిన వారు ఒంటరిగా ఉండాలని.. మందులు వాడాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. మద్రాస్ ఐని కళ్లకలక, పింక్ ఐ, రెడ్ ఐ పేరుతో పిలుస్తారు. కళ్లు ఎర్రబడటం, కంటి చుట్టూ నొప్పి, కళ్ల నుంచి నీరు కారడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
ఇది బ్యాక్టీరియా, వైరస్ వల్ల వస్తుంది. వ్యాధికి గురైనవారికి దగ్గరగా ఉన్నవారికి ఇది సోకే అవకాశం ఉంటుంది. ఇది అంటువ్యాధి. ఈ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ మొదటివారం వరకు ఈ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
అడినో వైరస్ కారణంగా ఈ మద్రాస్ ఐ ఇన్ఫెక్షన్ సోకుతుంది. 1918లో తొలిసారిగా మద్రాస్ లో దీన్ని గుర్తించడం వల్ల మద్రాస్ ఐ అనే పేరు వచ్చింది. ఎక్కువగా వేడి, తేమ ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. మద్రాస్ ప్రాంత, ముఖ్యంగా తమిళనాడులో ఈ తరహా వాతావరణం ఎక్కువగా ఉంటుంది.