Jupally Krishna Rao : హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతోంది. మే 7 నుండి 31వ తేదీ వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో సుమారు 140 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొనబోతున్నారు. తెలంగాణను అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చే ఈ వేదిక, రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయనుంది. ఈ పోటీల సందర్భంగా, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే నెలలో తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద, అభివృద్ధిని వీరు ప్రపంచానికి తెలియజేయనున్నారు.
మిస్ వరల్డ్ పోటీలపై మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీని హైదరాబాద్‌లో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఇది మహిళా సాధికారతకు అద్దం పట్టే సంబరాలు అని, ప్రపంచ దేశాల నుంచి రాబోయే అతిథులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశం అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఇప్పటికే ధనిక నగరాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది, ఈ పోటీలతో అంతర్జాతీయంగా మరింత గుర్తింపు పెరుగుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రపంచ వేదికపై తక్కువగా ప్రాచుర్యం పొందింది. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌తో మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అవకాశం లభించింది. ఇది రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు సహాయపడనుంది. కొంతమంది ఈ ఈవెంట్‌ను రాజకీయ కోణంలో చూస్తున్నా, ఇలాంటి అంతర్జాతీయ వేడుకలు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు, తెలంగాణ సంపదను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉపయోగపడతాయని మంత్రి స్పష్టం చేశారు.