పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే ‘వినాయక చవితి’గా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి పండుగను జరుపుకోనున్నారు. గణేష్ చతుర్థి ఉత్సవాలకు పల్లెలు, పట్టణాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల మండపాల నిర్మాణాలు పూర్తి కాగా.. గణేష్ విగ్రహాలు కూడా చేరుకున్నాయి. గణేష్ విగ్రహాల కొనుగోలు సందర్భంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈరోజు ఉదయం పంజగుట్ట చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Also Read: Crime News: మేడిపల్లిలో దారుణం.. గర్భవతైన భార్యను రంపంతో ముక్కలుగా కోసి హత్య చేసిన భర్త!
హైదరాబాద్ పంజగుట్ట చౌరస్తాలో ఫ్లైఓవర్ కింద గణేశుడి లారీ ఇరుక్కుపోయింది. ఖైరతాబాద్ వైపు నుంచి అమీర్ పేట్ వైపునకు వెళ్తున్న గణేషుడి విగ్రహ లారీ ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయింది. విగ్రహం ఎత్తు ఎక్కువగా ఉండడంతో ఫ్లైఓవర్ కింద నుంచి లారీ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. దాంతో పంజగుట్ట చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. పంజగుట్ట చౌరస్తాలో ఫ్లైఓవర్‌కు తగిలి ఇరుక్కున్న గణేషుడి లారీని బంజారాహిల్స్ వైపునకు మళ్లించారు.